ఓ గేదె అధికారుల అవినీతిని బయటపెట్టింది. ఆ బర్రె మృతితో వారు చేసిన అక్రమాలు బయటపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎంఎస్‌కేవై ద్వారా కామారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు జుక్కల్ మండలం పెద్దగుల్లా గ్రామానికి చెందిన 22 మంది రైతులకు 44 గేదెలను అందజేశారు. 50 శాతం రాయితీతో రూ.80 వేలు ధర ఉన్న గేదెలను రైతులు రూ.40 వేలకే అందజేశారు. అలాగే గేదే ప్రమాద భీమా కింద ఒక్కో రైతు దగ్గర తిరిగి రూ.6 వేలు వసూలు చేశారు. ఇక్కడే అధికారుల
చేతి వాటం చూపించారు. రైతు నుంచి తీసుకున్న సొమ్ముతో రెండింటికి బీమా చెల్లించకుండా ఒక్కదానికి మాత్రం బీమా చెల్లించి చేతులు దులుపుకున్నారు.
బీమా చేసినట్లు గుర్తుగా రెండు గేదెల చెవులకు పోగులు వేశారు. అయితే ఇటీవల పెద్దగుల్లా గ్రామానికే చెందిన రైతు గేదె మృతి చెందింది. దీంతో అతను బర్రెపై ఉన్న బీమా కవర్ చేసుకోవడానికి బాన్సువాడలోని కార్యాలయాన్ని సంప్రదించాడు. అయితే మృతి చెందిన ఆ గేదెకు వ్యవసాయాధికారులు బీమా చేయించలేదని చెప్పడంతో రైతు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. దీంతో ఉన్నతాధికారులను ఆ రైతు సంప్రందించాడు. ఈ ఘటనపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తామని డివిజన్ అధికారి తెలిపారు.