స్వరూపానందేంద్ర స్వామిని కలవనున్న జగన్

Update: 2019-06-03 08:20 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మంగళవారం విశాఖపట్నం వెళ్తున్నారు. ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖలో శారదాపీఠానికి వెళ్లి అక్కడ స్వరూపానందేంద్ర స్వామిని కలుసుకోబోతున్నారు. జగన్ సీఎం కావాలంటూ మొదట్నుంచి మద్దతిచ్చిన స్వామీజీ.. ఇందుకోసం కొన్ని యాగాలు కూడా జరిపించారు. ఈ నేపథ్యంలో.. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ తొలిసారిగా స్వరూపానందను కలుస్తున్నారు. ఆయనకు తన కృతజ్ఞతలు తెలపనున్నారు. ఈనెల 8వ తేదీన మంత్రుల ప్రమాణస్వీకారం ఉన్నందున ఆ ముహూర్తంపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇటీవల జగన్ ప్రమాణస్వీకార ముహూర్తం పెట్టింది కూడా స్వరూపానందే.. మంత్రుల విషయంలోనూ సీఎం సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. జగన్ ఇప్పటికే కేబినెట్‌లో ఎవరెవరికి చోటు కల్పించాలన్న దానిపై కసరత్తు పూర్తి చేశారు. 7వ తేదీన శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. 8న కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయబోతున్న వారి ముహూర్తం కోసం.. జగన్ శారదా పీఠానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖ సమీపంలోని చినముషిడివాడలో ఉన్న ఆశ్రమంలో జగన్ 2 గంటలపాటు గడపనున్నారని తెలుస్తోంది. సీఎం హోదాలో జగన్ తొలిసారి విశాఖకు వస్తున్నందున.. జిల్లా నేతలు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News