కరెంట్‌ స్థంభాన్ని ఢీ కొన్న ఆటో.. స్పాట్‌లోనే..

Update: 2019-06-03 02:03 GMT

విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో.. ఓ ఆటో అదుపు తప్పి ఓ కరెంట్‌ స్థంభాన్ని ఢీ కొంది. ఈ ఘటనలో డ్రైవర్ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. బలపం పంచాయితీ చెరువూరు గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. వీరంతా గిరిజనులు. ఆదివారం కావడంతో… కోరుకొండ వారపు సంతకు వచ్చారు. సరుకులు కొన్నాక ఓ సర్వీసు ఆటోలో స్వగ్రామాలకు బయల్దేరారు. మరికొద్దిసేపట్లో చెరువూరు చేరుకుంటామనగా… ఆటో అదుపు తప్పింది. రోడ్డు పక్కనే ఉన్న ఓ కరెంట్‌ స్థంబాన్ని ఢీకొంది. దీంతో విద్యుధాఘాతానికి గురై ఐదుగురు చనిపోయారు.

ఆటో డ్రైవర్‌ కృష్ణారావు, చెరువూరు చెందిన గంగరాజు, లోత బొంజిబాబు, ప్రసాద్ అక్కడిక్కడే చనిపోగా… తీవ్రంగా గాయపడిన చిట్టిబాబు ఆసుపత్రి తరలిస్తుండగా చనిపోయాడు. మరో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మృతుల కుటుంబసభ్యుల, బంధువుల రోదనలతో ఆసుపత్రి పరిసరాలు హృదయవిదాకరంగా మారాయి. మృతులంతా.. చెరువూరు చీకుపనస, సబ్బంపల్లి గ్రామాలకు చెందినవారు.

ఆటో ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రమాదంపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. బాధితకుటుంబాలకు ఐదు లక్షల పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు.

Similar News