బీజేపీకి తలనొప్పిగా మారిన డిప్యూటీ స్పీకర్ పదవి వ్యవహారం

Update: 2019-06-07 01:16 GMT

లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి వ్యవహారం ఇప్పుడు బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది. డిప్యూటీ స్పీకర్ పదవి తమకు కావాలంటే తమకు కావాలని శివసేన, బిజూ జనతాదళ్ పట్టుబడుతుండటంతో బీజేపీ అధినాయకత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఎన్డీఏలో బీజేపీ తరువాత తమదే పెద్ద పార్టీ కాబట్టి తమకే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయించాలని శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఎన్డీఏ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు అప్పట్లో రెండో పెద్ద పార్టీ అన్నా డీఎంకేకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చినట్లే ఈసారి తమకు ఇవ్వాలని థాక్రే డిమాండ్ చేస్తున్నారు.

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది చివరలో ఉన్న నేపథ్యంలో శివసేనను కాదంటే అసెంబ్లీ ఎన్నికల్లో సమస్యలు ఎదురవుతాయని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. అటు ఒడిషాలో అధికారంలోకి రావటంతోపాటు 13 లోక్‌సభ సీట్లు గెలుచుకున్న బీజేడీ లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని కోరుతోంది. తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు తథాగత సత్పథిని డిప్యూటీ స్పీకర్‌గా నియమిస్తే బీజేపీకి బయటినుంచి మద్దతు ఇస్తామని ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. శివసేనకు మంత్రివర్గంలో మరో క్యాబినెట్ పదవి ఇవ్వటం ద్వారా శాంతింపజేసి తమకు డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయించాలని బీజేడీ ప్రతిపాదిస్తోంది.. అయితే శివసేన అధినాయకత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరించిందని అంటున్నారు.

అయితే జేడీయూకు ఇదివరకే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చినట్లు తమకు ఈసారి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని శివసేన పట్టుబడుతోంది... మంత్రి పదవుల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న శివసేన డిప్యూటీ స్పీకర్ పదవి విషయంలో చాలా పట్టుదలతో వ్యవహరిస్తోంది... శివసేన, బీజేడీ డిమాండ్‌తో ఇరకాటంలో పడిన బీజేపీ అధినాయకత్వం లోక్‌సభ స్పీకర్ ఎన్నికల తరువాత డిప్యూటీ స్పీకర్ వ్యవహారం చూసుకోవచ్చని భావిస్తోంది... లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని కావాలన్నది తమ డిమాండ్ కాదని, తమ పార్టీ హక్కని.. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై తమకు వ్యతిరేకత లేదని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే తెలిపారు.

Similar News