వైసీపీలో ఫైర్‌బ్రాండ్ అంటే రోజాయే. ఆమెకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. కానీ.. ఏపీ కేబినెట్ కూర్పులో వివిధ సమీకరణాలు, సామాజిక లెక్కల కారణంగా ప్రస్తుతానికి రోజాకు చోటు దక్కలేదు. ఈ అంశంపై విజయశాంతి స్పందించారు. ఎమ్మెల్యే రోజాకు జగన్ తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తే బాగుండేదని ట్విట్టర్‌లో అభిప్రాయపడ్డారు. సినీరంగం నుంచి వచ్చిన వాళ్లను ప్రచారానికే పరిమితం చేయకుండా.. వారి సేవలు వినియోగించుకుని గుర్తింపు ఇస్తే బాగుంటుందన్నారు. రాబోయే రోజుల్లో రోజా విషయంలో.. ముఖ్యమంత్రి జగన్ సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానన్నారు విజయశాంతి. జగన్ తన కేబినెట్‌లో మహిళకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారని, ఇది చూసయినా కేసీఆర్‌గారు మహిళలకు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తారా..? అని కూడా రాములమ్మ ప్రశ్నించారు.
ఏపీ కేబినెట్ కూర్పుపై తన అభిప్రాయం చెప్తున్నాను అంటూ విజయశాంతి చేసిన ట్వీట్లు.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా రోజాకు మద్దతుగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో రోజా, విజయశాంతి పాతికేళ్లపాటు ఓ వెలుగు వెలిగారు. ఆతర్వాత రాజకీయాల్లోనూ రాణించారు. రాములమ్మ ఎంపీగా లోక్‌సభలో అడుగుపెడితే.. రోజా MLAగా ఏపీ అసెంబ్లీకి వెళ్లారు. స్టార్ క్యాంపైనర్లుగా, ఫైర్ బ్రాండ్‌లుగా వీరిద్దరికీ ఆయా పార్టీల్లో మంచి గుర్తింపు ఉంది. ఐతే.. ఏపీలో వైసీపీ బంపర్ మెజార్టీతో గెలిచినా రోజాకు మంత్రి పదవి దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడీ అంశంపై విజయశాంతి కూడా స్పందించడంతో మరోసారి ఇది హాట్ టాపిక్ అయ్యింది.
సినీ రంగానికి చెందిన ఎమ్మెల్యే రోజా కూడా జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. సినీ రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చిన వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా వారి సేవలు వినియోగించుకుని,
— VijayashanthiOfficial (@vijayashanthi_m) June 11, 2019
వారికి కూడా తగిన గుర్తింపు ఇస్తే బాగుంటుందని నేను చెప్పదలుచుకున్నాను. రాబోయే రోజుల్లో నైనా జగన్ గారు రోజా విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను... విజయశాంతి
— VijayashanthiOfficial (@vijayashanthi_m) June 11, 2019