100 మందికి పైగా సీనియర్‌ డాక్టర్ల రాజీనామా

Update: 2019-06-15 05:23 GMT

బెంగాల్‌లో జూనియర్‌ డాక్టర్లపై దాడి వివాదం రోజు రోజుకు ముదురుతోంది. డాక్టర్లపై దాడిని ఖండిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళన ఉధృతమయ్యాయి. పలు రాష్ట్రాల్లో తలకు బ్యాండేజ్‌ కట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. ఆస్పత్రిలో వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని.. వెంటనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యులకు భద్రత కల్పించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

కోల్‌కతాలోని NRS వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న ఓ రోగి ఇటీవల మృతి చెందాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మృతుని బంధువులు..ఆసుపత్రి సిబ్బందిపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు జూనియర్‌ వైద్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని నిరసిస్తూ బెంగాల్‌లోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులతో పాటు కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోని జూనియర్‌ వైద్యులు సమ్మెకు దిగారు. కోల్‌కతా దాడిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా సమ్మెబాట పట్టారు డాక్టర్లు.

మరోవైపు మూడురోజుల పాటు ఆందోళనలకు పిలుపునిచ్చింది ఇండియన్‌ మెడికల్ అసోషియేషన్‌. బెంగాల్‌లో దాడిలో గాయపడ్డ వైద్యులకు సంఘీభావంగా నిన్నటి నుంచి నిరసలు ఉధృతమయ్యాయి. మరోవైపు ఈ నెల 17న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది ఐఎంఏ. అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో అవుట్‌ పేషంట్‌ విభాగాలతో పాటు అత్యవసరం కాని వైద్య సేవలన్నిటినీ 24 గంటల పాటు నిలిపివేయాలని సూచించింది.

ప్రభుత్వాసుపత్రుల్లో తమకు భద్రత కల్పించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్లో జూనియర్‌ డాక్టర్లు చేపట్టిన సమ్మె ఐదో రోజుకు చేరింది. సమ్మె విరమించాలని సీఎం మమతాబెనర్జీ హెచ్చరించినప్పటికీ వాటిని వైద్యులు బేఖాతరు చేశారు. వైద్యులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేంతవరకు విధుల్లో చేరేది లేదని తేల్చి చెప్పారు. మరోవైపు బెంగాల్‌ జూనియర్‌ డాక్టర్ల సమ్మెకు సంఘీభావంగా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రులకు చెందిన 100 మందికి పైగా సీనియర్‌ డాక్టర్లు రాజీనామా చేశారు. మరికొంత మంది రాజీనామాలకు సిద్ధమయ్యారు.

సీఎం మమతా బెనర్జీ నచ్చజెప్పిన డాక్టర్లు మెట్టు దిగడం లేదు. దీంతో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. చికిత్స లభించక వైద్యులు పడుతున్న ఇబ్బందులకు తెరదించాలని.. వారంలోగా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని సూచించింది.

Similar News