ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి జగన్..

Update: 2019-06-20 03:21 GMT

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలనకు శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా తొలిసారిగా ఈరోజు పోలవరానికి వెళ్తున్నారు..ఉదయం పదకొండున్న గంటలకు హెలికాప్టర్‌లో పోలవరం చేరుకుంటారు.. స్పిల్‌ వే, స్పిల్ చానల్, కాఫర్ డ్యాం, తదితర పనులు పరిశీలిస్తారు. ఆతర్వాత హెడ్‌ వర్క్స్‌, కుడి, ఎడమ అనుసంధానాలు, నావిగేషన్‌ కెనాల్, పవర్‌ ప్రాజెక్టు, కుడి, ఎడమ కాలువల పురోగతి, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసంపై అధికారులతో సీఎంఎ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటివరకూ చేసిన పనులను గోదావరి వరద బారి నుంచి రక్షించుకోవడం, నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సహాయక చర్యలు చేపట్టడంపై దిశానిర్దేశం చేయనున్నారు.

జగన్‌ పోలవరం పర్యటనపై ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రులు ఆళ్ల నాని, అనిల్‌ కుమార్ యాదవ్‌ ప్రాజెక్టు సైట్‌కు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ సహా అన్ని అంశాలపై అధికారులతో జగన్‌ సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. గత 6 నెలల్లో జరిగిన పనుల పరిశీలనకు సీఎం ఇప్పటికే ఒక కమిషన్‌ ఏర్పాటు చేశారని జలవనరుల మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. జులై 15 తర్వాత వచ్చే వరదల బారిన పడే అవకాశమున్న 48 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు.

పోలవరాన్ని గత ప్రభుత్వం కమీషన్ల ప్రాజెక్టుగా మార్చిందని మంత్రి ఆళ్ళ నాని విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు . అవకవతకలు సరిదిద్ది, వేగంగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారాయన. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు పనులపై క్షేత్ర స్థాయిలో తన పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడంపై సీఎం జగన్‌ దృష్టిపెట్టనున్నట్లు తెలుస్తోంది.

Similar News