AP: నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని ప్రచారం
పటిష్ట బందోబస్తు ఏర్పాటు.... విజయవాడలో చంద్రబాబు, పవన్‌తో కలిసి రోడ్ షో;
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. వేములవాడ, వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం హైదారాబాద్‌కు చేరుకున్న ప్రధాని.. రాత్రి రాజ్ భవన్‌లో బస చేశారు. ఉదయం ఎనిమిదిన్నర సమయానికి బేగంపేట విమానాశ్రయానికి బయల్దేరి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చేరుకుంటారు. శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా ప్రచారసభలో మోదీ పాల్గొంటారు. తర్వాత వరంగల్ భాజపా లోక్‌సభ అభ్యర్థి ఆరూరి రమేష్‌కు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. ఈ సభ అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లనున్నారు.
విజయవాడలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్‌షోలో పాల్గొననున్నారు. ప్రధానితో పాటు టీడీపీ, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు హాజరవుతారు. బందరు రోడ్డులోని పీవీపీ మాల్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు యాత్ర సాగనుంది. రాత్రి 7 గంటలకు మొదలై.... 8 గంటలకు పూర్తవుతుంది. వేలాది మంది తరలిరానున్న సందర్భంగా... ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే పోలీస్‌లు ట్రాఫిక్‌ను మళ్లించారు. S.P.G రక్షణ ఛట్రంలో ఉండే ప్రధాని మోదీ భద్రతకు సంబంధించి ఎటువంటి లోపాలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. రెండు వరుసల ఇనుప బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటనకు దాదాపు 5 వేల మందిని నగరంలో మోహరించనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నగరంలోని బందరు రోడ్డు వరకు బందోబస్తు విధులు కేటాయించారు. ఎక్కడా లోపం తలెత్తకుండా మొత్తం ఆరుగురు ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు.