అసెంబ్లీ నిబంధనలు, ప్రవర్తనా నియమావళిపై అసెంబ్లీ మీటింగ్ హాల్ లో ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు జరిగాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ తరగతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీ నిర్వహణ తీరు, గౌరవ సభ్యులు ఎలా ప్రవర్థించాలి? అన్న అంశాలన్నింటిపై శిక్షణ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీని వేదికగా చేసుకొని ఎలా వినియోగించుకోవాలో వివరించారు. రూల్స్ బుక్‌ను అందరూ చదవాలన్న సీఎం జగన్.. ఎమ్మెల్యేలకు కావాల్సిన మెటీరియల్‌ను పార్టీ ఇస్తుందని తెలిపారు.
సభలో అవకాశాలు దక్కాలంటే చేయి పైకి ఎత్తితే చాలు అని అనుకోకూడదన్నారు. నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు అడిగితేనే ఆ అవకాశం దక్కుతుందని సూచించారు. ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు ముందు కసరత్తు చెయ్యాలని, ఎంత గొప్ప వ్యాఖ్యాత అయిన అసెంబ్లీలో ఫెయిల్ అవుతారని జగన్ హెచ్చరించారు.
సభలో నిబంధనల ప్రకారం స్పీకర్ వ్యవహరిస్తారని, ప్రతి అంశంపై సభ్యుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు. అవకాశం వచ్చి మాట్లాడకుంటే ఆ సభ్యుడు ఫెయిలైనట్టే అన్నారు. సరైన ప్రజెంటేషన్ లేకుంటే సభ్యుడు రాణించలేడని ఆయన పేర్కొన్నారు. సభా సమయాన్ని వృధా చేయొద్దని, ప్రతి ఒక్క ఎమ్మెల్యే రూల్స్ బుక్‌ని చదవాలని ముఖ్యమంత్రి సూచించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు తాను తెల్లవారుజామున నాలుగు గంటలకే ప్రిపేర్ అయ్యేవాడినని సీఎం జగన్ తెలిపారు.
ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే గత ప్రభుత్వం మైక్‌లు కట్ చేసేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అప్పటిలా ఈ అసెంబ్లీ నిర్వహణ ఉండదన్నారు. శాసనసభలో ప్రతిపక్షం అనేది ఉంటేనే బాగుంటుందన్నారు. టీడీపీకీ 23మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారిలో అయిదుగురిని లాగేస్తే ప్రతిపక్షం ఉండదని తనకు చాలామంది చెప్పారన్నారు. కానీ తాను అలా చేయనని చెప్పానన్నారు. పార్టీ మారితే రాజీనామా అయినా చేయాలి, లేకుంటే అనర్హత వేటు అయినా వేయాలని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది ఉండాలని, మనం ఎవరైనా ఎమ్మెల్యేలను తీసుకోవాలంటే రాజీనామా చేయించాలని, ప్రజల్లోకి వెళ్లి మనం గెలిపించుకున్న తరువాత మన ఎమ్మెల్యే అవుతారని జగన్ పేర్కొన్నారు.