ఏపీ ప్రభుత్వం.. గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే ఈ స్కీమును నిలిపివేయడం దారుణమంటూ స్టూడెంట్స్ రోడెక్కుతున్నారు. వెంటనే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం రద్దుపై ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. గుంటూరులో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ధర్నాకు చేశారు. అక్షరాస్యత పెంపునకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఈ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అటు కడప జిల్లాలోనూ సర్కారు నిర్ణయంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఈ స్కీము ద్వారా లబ్ది పొందుతున్నారని... ఇలాంటి పథకాన్ని నిలిపివేయడం తగదంటున్నారు. అటు ప్రకాశం జిల్లాలోనూ మిడ్ డే మీల్స్ రద్దుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేద విద్యార్థులకు ఉపయోగపడే ఈ పథకాన్ని ఎందుకు రద్దు చేశారో అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. మధ్యాహ్న భోజనం పథకంతో జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని విద్యావేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు ఈ పథకం రద్దుతో డ్రాపవుట్స్ పెరుగుతాయంటున్నారు. జూనియర్ కాలేజీల్లో మళ్లీ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.