ఏపీ రైతులకు అందాల్సిన విత్తనాలు తెలంగాణకు ఎలా వెళ్లాయి : నారా లోకేష్

Update: 2019-07-06 15:54 GMT

ఏపీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలపై ట్విట్టర్ వేదికగా విమర్శల దాడి కొనసాగిస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్. కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామన్న మీరు.. ఇప్పుడు ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. కాళ్లకు సాష్టాంగ పడటం, భజన చేయడమే మీ పోరాటమనుకుంటున్నారా? అని కడిగి పారేశారు. ఏపీ ప్రయోజనాలను సాధించడానికి మీరేం చేయదలుచుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

గతంలో కేంద్రం ఇలాగే ఏపీకి మొండి చెయ్యి చూపిస్తే, నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు రాజీనామా చేయాలని మీరు డిమాండ్‌ చేశారని లోకేశ్ గుర్తు చేశారు. మరి ఇప్పుడు మీరెందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. రెండు రోజుల కిందట విత్తనాల కొరతకు గత ప్రభుత్వమే కారణమంటూ మంత్రుల చేసిన ఆరోపణలను ఖండించిన లోకేశ్... జగన్ గారు మీకైనా సోయి ఉండాలన్నారు. విత్తనాల కొరతకు గత ప్రభుత్వం ఎలా కారణమవుతుందని ప్రశ్నించారు. ఏపీ నుంచి తెలంగాణ సర్కార్‌ 10వేల క్వింటాళ్ల విత్తనాలు కొనుగోలు చేసిందన్నారు. ఇదేమన్న ఇడ్లీనా, ఉప్మానా రాగానే విత్తనాలు ఇవ్వడానికన్న వైసీపీ ప్రభుత్వం.. ఏపీ రైతులకు అందాల్సిన విత్తనాలు తెలంగాణకు ఎలా వెళ్లాయో చెప్పాలి’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

Similar News