మేడిగడ్డ బ్యారేజ్‌లో జలకళ.. భారీగా వస్తున్న సందర్శకులు

Update: 2019-07-13 03:10 GMT

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌ గేట్లను మూసివేశారు. బ్యారేజీలో మొత్తం 85 గేట్లను మూసేయడంతో వరద ప్రవాహం నదీ గర్భంలో నిలుస్తోంది. 35 కిలోమీటర్లు మేర బ్యాక్‌ వాటర్ స్టోర్‌ అవుతోంది. అటు కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద ప్రవాహం మోటర్ల ద్వారా ఎత్తిపోస్తూ నీటి తరలింపు కొనసాగుతోంది.

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ జల కళ సంతరించుకుంది. ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాణహిత నదిలోకి నీటి ప్రవాహం రావడంతో... కాళేశ్వరం వద్ద గోదావరి ప్రహహం క్రమంగా పెరుగుతోంది. దీంతో మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి నీటి మట్టం 93.5 లెవెల్‌కు చేరింది. బ్యారేజీకి 6.5 మీటర్ల ఎత్తులో 3.3 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో బ్యారేజీకి 85 గేట్లను ముందస్తుగా మూసేశారు అధికారులు. దీంతో వరద ప్రవాహం నదీ గర్భంలో నిలుస్తోంది. 35 కిలోమీటర్లు మేర బ్యాక్‌ వాటర్ స్టోర్‌ అవుతోంది.

అటు కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద ప్రవాహం మోటర్ల ద్వారా ఎత్తిపోస్తూ నీటిని తరలించే ఘట్టం కొనసాగుతోంది. కన్నెపల్లి పంప్‌హౌస్‌లోని 4 మోటార్లు నీటిని ఎత్తుపోస్తున్నాయి. దీంతో గ్రావిటీ కెనాల్‌ ద్వారా ఇప్పటివరకు 20 వేల క్యూసెక్కులు నీరు అన్నారం బ్యారేజీలో చేరుతోంది......కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద ప్రాణహిత, గోదావరి నదుల ప్రవాహం 10 క్యూసెక్కులు ఉంటుందని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అన్నారం బ్యారేజీలోకి 2.5 TMC నీటిని వదిలారు. ప్రస్తుతం 7 మీటర్ల లెవెల్‌లో నీరు చేరుకుంది. అన్నారం బ్యారేజ్ బ్యాక్‌ వాటర్‌ 22 కి.మీకు చేరుకుందంటున్నారు అధికారులు. సాధారణ పుష్కర ఘాట్ల వద్ద ఉభయ నదుల నీటిమట్టం 3. 27 మీటర్లుగా ఉంది.

మేడిగడ్డ బ్యారేజ్‌లో జలకళ సంతరించుకోవడంతో ... ప్రజలు దీన్ని చూసేందుకు ఇక్కడికి వస్తున్నారు. మూడు రోజులు వరుస సెలవులు రావడంతో సందర్శకుల తాకిడి పెరింది.

Similar News