మాట తప్పను మడమ తిప్పను అంటే ఇదేనా? : ఎమ్మార్పీఎస్

Update: 2019-07-31 02:23 GMT

ఎస్సీ వర్గీకరణపై వైసీపీ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని.. వర్గీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని MRPS డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా ఏపీ అసెంబ్లీ ముట్టడి చేపట్టారు. వెంటనే అలర్ట్‌ అయిన పోలీసులు.. రాష్ట్రవ్యాప్తంగా MRPS కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

ఏపీ అసెంబ్లీ ముట్టడిని అడ్డుకున్న ప్రభుత్వం, పోలీసుల తీరుపై MRPS నేతలు మండిపడ్డారు. జిల్లాల్లో సమితి కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు.

ప్రభుత్వ తీరుకు నిరసనగా విజయవాడలో కొందరు కార్యకర్తలు వాటర్ ట్యాంక్‌ ఎక్కారు. నెహ్రూ బస్టాండ్‌ దగ్గరున్న కాళీమాత గుడి సమీపంలో వాటర్‌ ట్యాంక్‌ పైకి ఎక్కిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు... ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధమంటూ నినాదాలు చేశారు. 5 గంటలు అక్కడే ఉన్నారు. వారితో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్.. చర్చలు జరిపి వర్గీకరణపై హామీ ఇవ్వడంతో దిగొచ్చారు.

MRPS కార్యకర్తలు ఒంగోలులో కలెక్టరేట్‌ ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, MRPS కార్యకర్తలకు మధ్య పెనుగులాట జరిగింది.

కాకినాడలోనూ MRPS కార్యకర్తలు ఆందోళ బాట పట్టారు. మాట తప్పను మడమ తిప్పను అంటే ఇదేనా అని సీఎం జగన్‌ను నిలదీశారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టి నిరసన తెలిపారు.

Similar News