పచ్చని అడవుల్లో ఆకట్టుకునే జలపాతలు. ఆకాశం నుంచి జాలువారి.. దూదిపింజల్లా స్పృశించే అనుభూతి. రాళ్ల గుట్టల మీదుగా కిందకు జాలువారుతూ.. అడవి అందానికి వన్నే తెచ్చే జలపాతాలు కొత్త కళ సంతరించుకున్నాయి. విస్తారంగా వర్షాలు కురియటంతో పచ్చని అడువుల మధ్య పాలనురుగు ప్రవాహంతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ పర్యాటక క్షేత్రం కుంటాల వాటర్ ఫాల్స్ జలకళతో ఆకట్టుకుంటోంది. గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలపాతానికి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. గుట్టల్లోనుంచి జాలువారుతున్న జలపాత అందాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి.
వర్షాకాల ప్రారంభం నుంచి డిసెంబర్ వరకు స్థానికంగా పర్యాటక సీజన్‌గా పరిగణిస్తారు. అయితే ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో జులై నెల చివర పర్యాటక సీజన్ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఇక్కడికి పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. కుంటాల జలపాతం అందాలను, పరిసరాల్లోని రమణీయ దృశ్యాలను ఆస్వాధించడానిఇక వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద
సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు.
నేరడిగొండ మండలంలోనే ఉన్న మరో జలపాతం పొచ్చేర వాటర్ ఫాల్స్. భారీ వర్షాలతో పొచ్చేర గుండంలోకి కూడా వరద నీరు పోటెత్తింది. ఈ జలపాతాన్ని చూసేందుకు వచ్చే టూరిస్టుల సంఖ్య కూడా పెరిగింది.
ప్రకృతి అందాల సోయగం లక్నవరం సరస్సు జలకళ సంతరించుకుంది. ములుగు జిల్లాలోతోపాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు లక్నవరం సరస్సులోకి భారీగా వరదనీరు చేరుతోంది. కొన్ని రోజుల క్రితం జలసిరి లేక వెలవెలబోయిన సరస్సు... ఇప్పుడు నిండుకుండలా మారింది. సరస్సులో కనుచూపమేర నిండుగా నీరు చేరడంతో సరస్సు మధ్యలోని సస్పెన్షన్ బ్రిడ్జిపై నుంచి సుందర ప్రకృతి మరింత అందంగా కనిపిస్తోంది.
ఎడతెరిపిలేని వర్షాలకు బొగ్గులవాగు ఉప్పొంగడంతో లక్నవరంలోకి విపరీతంగా నీరు ప్రవహిస్తోంది. 36 అడుగుల సామర్ధ్యం గల లక్నవరం సరస్సులో 30 అడుగుల నీరు చేరింది. జలసిరులతో లక్నవరం నిండటంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పడితే... లక్నవరం అందాలు వీక్షించడానికి పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున తరలిరానున్నారు.
ములుగు జిల్లాలోని బొగత జలపాతం జలకళ సంతరించుకుంది. వర్షాలకు జలసిరి నిండుగా రావడంతో ప్రకృతి అందాల మధ్య జలపాతం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. జలధార అందాలను ఆస్వాదిస్తూ... ఆ నీటిలో జలకాలాడుతూ మైమరచిపోయేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.
తెలంగాణ నయాగరాగా ఖ్యాతిగాంచిన బొగత జలపాతం కొండకోనల మధ్య అద్భుతంగా కనువిందు చేస్తోంది. గలగల శబ్దాలు చేస్తూ ప్రవహించే పాలధారలా నురుగలు కక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ అందాలను చూస్తూ పర్యాటకులు తన్మయత్వానికి లోనవుతున్నారు.