తెలంగాణకే తలమాణికంగా నిలిచేలా యాదాద్రి నవనిర్మాణం మహాయజ్ఞంలా కొనసాగుతోంది. ఆలయాన్ని ఆధ్యాత్మిక దివ్యరాజధానిగా చేయడానికి జరుగుతున్న పనులను పరిశీలించి దిశా నిర్ధేశం చేసేందుకు ఇవాళ సిఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. 2వేల కోట్ల రూపాయల ప్రాధమిక అంచనా వ్యయంతో ప్రారంభించిన నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 800 కోట్ల వరకు వెచ్చించి విస్తరణ పునర్నిర్మాణ పనులలో శిల్పి పనులు 95 శాతం పూర్తి చేశారు. పనుల్లో పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు సీఎం వస్తుండటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. హైద్రాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ముఖ్యమంత్రి యాదాద్రికి చేరుకుంటారు.ఆలయ అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. కొండపైన నిర్మాణమవుతున్న ప్రధానాలయం పనులపై ఆలయాధికారులతో సమీక్షిస్తారు.
చినజీయర్ స్వామి సూచనలతో ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా 1048 యజ్ఞకుండలు.3వేల మంది రుత్వికులతో శ్రీ సుదర్శన మహా యాగం నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. యాదాద్రి పర్యటనలో దీనికి సంబంధించిన స్థలాన్ని పరిశీలించి అర్చకులతో చర్చించనున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా యాదాద్రిలో వైటీడీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి వారి దర్శనం సమయాల్లో మార్పులు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.