తగ్గని కృష్ణానది ఉద్ధృతి.. వరదలపై అమెరికా నుంచి సీఎం జగన్ సమీక్ష

Update: 2019-08-18 02:09 GMT

వర్షాలు లేవు. కానీ, వరద ఇళ్లను ముంచేస్తోంది. పంటలు కనిపించటం లేదు. ఊళ్ల ఆనవాళ్లు అర్ధం కావటం లేదు. ఎటూ చూసిన నీరే. సాయం కోసం వెళ్లే వారు ఏ ఊరికి వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి. అంతలా వరద నీరు ముంచెత్తింది. వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నదీ పరీవాహక ప్రాంతాలన్నీ జలదిగ్బంధమయ్యాయి. వరద కారణంగా కృష్ణా జిల్లాలోని 34 గ్రామాలు నీటిలో నానుతున్నాయి. కృష్ణానది వరద నీరు కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వర నగర్‌లోని ఇళ్లను ముంచెత్తింది. వరద నీరు ఇంటిపైకప్పు వరకు చేరడంతో ప్రజలు కట్టుబట్టలతో రోడ్లపైకి వచ్చారు.

కృష్ణానది వరదతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ఉధృతి నుంచి ప్రజలను రక్షించాలని ఆలోచనతో టీడీపీ ప్రభుత్వం దాదాపు 600 కోట్ల రూపాయల అంచనాలతో కృష్ణలంక నుంచి యనమలకుదురు వరకు రీటైనింగ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టింది. మొదటి ఫేజ్‌లో యనమలకుదురు నుంచి రామలింగేశ్వర్‌ నగర్‌ వరకు పూర్తి చేశారు. ఇదే రిటైనింగ్‌ వాల్‌ పూర్తయింతే.. కృష్ణలంక, గీతానగర్‌, రాణిగారితోట తదితర ప్రాంతాలకు వరద ముంపు తప్పేది.

జిల్లాలోని మోపిదేవి మండలాన్ని వరద నీరు చుట్టుముట్టింది. కొక్కిలిగడ్డ హరిజనవాడలో 278 ఇళ్లు నీటమునిగాయి. పులిగడ్డ శివారు పల్లెపాలెం, రేగుల్లంక, దక్షిణ చిరువోలు లంక గ్రామాలు నీటిమునిగాయి. ముంపు గ్రామాల్లో సహాయక చర్యలను వేగవంతం చేశారు. ముంపు అధికంగా ఉన్న 10 మండలాల్లో 18 బోట్లతో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. ముంపు గ్రామాల ప్రజలను అగ్నిమాపక సిబ్బంది పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కృష్ణా జిల్లాలో 41 పునరావాస కేంద్రాలు, 32 మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఆహార పొట్లాలు, మంచినీళ్ల ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ఏరియల్‌ సర్వే ద్వారా పర్యవేక్షించారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం, నీట మునిగిన లంక గ్రామాలను పరిశీలించారు. వరద నివారణ చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. మరోవైపు కృష్ణానది వరదలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. సీఎంఓ అధికారులు పంపిన నివేదికలను సీఎం జగన్‌ పరిశీలించారు. ఎగువనుంచి వస్తున్న వరద, విడుదల చేస్తున్న జలాలపై ఆరా తీశారు. బాధితులకు సహాయం అందించడంలో ఎలాంటి అలసత్వం వద్దని ఆదేశించారు సీఎం. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతిని ఏపీ మంత్రులు అనిల్, బొత్స, వెల్లంపల్లి, పేర్ని నాని, కొడాలి నాని పరిశీలించారు. 15 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని, 1600 హెక్టార్లలో పంట దెబ్బతిందని ప్రాథమిక అంచనా వేశామన్నారు. మూడ్రోజుల్లో సాధారణ పరిస్థితి నెలకొంటుందని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Similar News