అమరావతి మార్పు తప్పదనే సంకేతాలు..

Update: 2019-08-25 14:30 GMT

ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా అమరావతి పైనే చర్చ. రాజధానిని పూర్తిగా తరలిస్తారా? లేక కుదిస్తారా? కేపిటల్‌ను దొనకొండలో ఏర్పాటు చేస్తారా ఇలా రకరకాల ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి. అటు మంత్రులు తలోరకంగా చేస్తున్న ప్రకటనలు కూడా గందరగోళాన్ని మరింత పెంచుతున్నాయి. మొత్తానికి అమరావతి మార్పు తప్పదనే సంకేతాలైతే స్పష్టంగా ఇస్తోంది ప్రభుత్వం.

అమరావతిపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు బొత్స. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. రాజధాని ఏ ఒక్కరిదో, ఏ ఒక్క సామాజిక వర్గానిదో కాదన్నారు. రాజధానిపై శివరామకృష్ణ కమిటీ నివేదికను గత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. 8 లక్షల క్యూసెక్కులకే అమరావతి ముంపునకు గురైందని.. 11 లక్షల క్యూసెక్కుల వరద వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అమరావతి విషయంలో పవన్ వ్యాఖ్యలు ద్వంద్వ అర్ధాన్ని తలపిస్తున్నాయన్నారు.

బొత్స వ్యాఖ్యల దుమారం కొనసాగుతుండగానే బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన కామెంట్లు చేశారు..ఇకపై రాష్ట్రానికి నాలుగు రాజధానులు ఉండబోతున్నాయని చెప్పారు. విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప జిల్లాలు ఏపీకి రాజధానులుగా ఉంటాయని తెలిపారు. ఇది నూటికి నూరు శాతం జరిగి తీరుతుందని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా కేపిటల్ అమరావతిలోనే ఉంటుందని చెప్తుంటే.. ఢిల్లీ నుంచి ఉన్న సమాచారం మేరకు ఏపీలో నాలుగు కేపిటల్స్ ఉంటాయంటూ కలకలం రేపారు.

అటు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. ఈ అంశంపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. అమరావతి మార్పుపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటనైతే రాలేదు. అలాగని మార్పు వార్తలను ఖండించనూ లేదు. దీంతో రాజధాని ప్రాంత రైతుల్లో తీవ్ర అందోలన వ్యక్త మవుతోంది. కేపిటల్‌ను మార్చొద్దంటూ...నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

Similar News