ఏపీలో ఇసుక పాలసీ ప్రకటించకపోవడంతో భవన నిర్మాణ రంగం బావురుమంటోంది. ఇదే అదనుగా అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. ఇసుక కొరత గుంటూరు జిల్లా అధికార పార్టీ నేతలకు వరంగా మారుతోంది. డిప్యూటీ స్పీకర్ నియోజకవర్గమైన బాపట్లలో ఇసుక మాఫియా బరితెగిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు.
ఇసుక అవసరం ఎక్కువగా ఉండడంతో... అక్రమ దందాకు తెరలేపారు. ఒక ట్రాక్టర్ ఇసుక 18 వందలు ఉండగా, గుంటూరు వచ్చే సరికి 7వేల 5 వందలవుతోంది. అత్యవసరమనుకున్నవారు... భారంగానైనా ఆ రేటుకు ఇసుక కొంటున్నారు. ఇదేం ఖర్మరా అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. ట్రాక్టర్ ఇసుక 7 వేల 5 వందలకు విక్రయిస్తున్నా.. 18 వందలే అంటూ బుకాయిస్తున్నారు.
నిబంధనల ప్రకారం ఇసుక కోసం పంచాయితీ స్లిప్పులు లోకల్‌లో అవసరం ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలి. అయితే బాపట్ల నుంచి గుంటూరుకు అధికారులు ఇచ్చిన స్లిప్పులు TV 5 సంపాదించింది. దీన్ని బట్టి అధికారులే దగ్గరుండి ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారన్నది స్పష్టమవుతోంది.
ఓ వైపు ఇసుక కొరతపై టీడీపీ ధర్నాలు, నిరసనలు చేస్తుంటే... మరో వైపు అధికార పక్ష నేతల ఇసుక దోపిడీ కొనసాగుతోంది. పచ్చని పంటపొలాల్లో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఇక అధికారులు కూడా జీ హుజూర్ అంటూ అక్రమార్కులకు సాయమందిస్తున్నారు.