పురపాలక ఎన్నికలపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా మంగళవారం తెలంగాణభవన్‌లో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్షించిన ఆయన, పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు. జిల్లాలోని పురపాలకసంఘాల ఎన్నికల సమన్వయం కోసం పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఒకట్రెండురోజుల్లో ఇన్‌ఛార్జీలను ప్రకటిస్తారని చెప్పారు. పురపాలక ఎన్నికల్లేని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్లకు ఈ బాధ్యతలు అప్పగిస్తారన్నారు. పురపాలక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పార్టీ సభ్యత్వ నమోదు విజయవంతమైందని, బస్తీ, డివిజన్ కమిటీల ఏర్పాటును ఈనెల ఆరోతేదీ నాటికి పూర్తిచేయాలని సూచించారు. ప్రతి పోలింగ్‌కేంద్రానికి ఒక సోషల్ మీడియా కోఆర్డినేటర్‌ను నియమించుకోవాలని.. వారికి పార్టీ తరఫున శిక్షణా కార్యక్రమాలు ఉంటాయన్నారు.
అటు.. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకు కృషిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధిస్తుందన్న కేటీఆర్.. ఈ ఎన్నికలకు సంబంధించి పార్టీపరంగా తీసుకోవాల్సిన కార్యాచరణపైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులతో చర్చించారు.
మరోవైపు.. మున్సిపల్ ఎన్నికలపై చర్చించేందుకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 6న పార్టీ ప్రధాన కార్యదర్శులు, మున్సిపాలిటీల ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లతో సమావేశం కానున్నారు.