తూర్పుగోదావరి రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయి. గురువారం, శుక్రవారం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. గత నెలలో రాజోలు నియోజకవర్గంలో పోలీసులు అరెస్ట్ చేసిన ఒక కేసు విషయమై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళారు. ఆ సమయంలో పోలీసులతో జరిగిన చర్చల అంశంలో మలికిపురం పోలీసులు ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేయటం, అటు తరువాత ఆయన్ను అరెస్ట్ చేయటం వంటి ఘటనలు చోటు చేసుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై పవన్ ఘాటుగానే స్పందించారు. సున్నితమైన అంశంలో పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమవటంతో అవసరమైతే తూర్పులో స్వయంగా పర్యటిస్తానని, జనసైనికులు కదం తొక్కుతారని, ప్రభుత్వ తీరు, అధికారుల తీరు మార్చుకోవాలని పేర్కొన్నారు.
జనసేన పార్టీ పట్ల తూర్పుగోదావరి జిల్లాలో ఫ్లెక్సీల వివాదం, కార్యకర్తలపై కేసులు నమోదు చేయటం వంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో పవన్ పర్యటనకు రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం రాజోలు నియోజకవర్గం దిండి రిసార్ట్స్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ సమావేశానికి పార్టీ నేతలకు తప్ప ఇతరులెవ్వరికీ అనుమతి ఇవ్వరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
శుక్రవారం ఉదయం 7 గంటలకు దిండి నుండి రామరాజులంక, అప్పనిరామునిలంక, టేకిశెట్టిపాలెం, సఖినేటిపల్లి సెంటర్, గుడిమూల, గోంది గ్రామాలలో పర్యటించిన అనంతరం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. అక్కడ నుంచి మోరి, VV మేరక, మల్కిపురం, గుడిమేళ్ళంక, శివకోటి మీదుగా మళ్లీ దిండి చేరుకుంటారు. అయితే పవన్ పర్యటన నేపథ్యంలో మలికిపురంలో బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. ఎన్నికల అనంతరం తొలిసారి పవన్ పర్యటనకు వస్తుండటంతో జిల్లా జనసేన నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.