మనిషిని భయపెట్టాలంటే మూఢనమ్మకాలను మించిన మార్గం మరేదీ ఉండదేమో..! క్షుద్రపూజలు, చేతబడులు పేరు చెప్తే ఇప్పటికీ పల్లెల్లో జనం వణికిపోతారు. అలాంటిది రోడ్డుపై ఓ పెద్ద మూట పడేసి దాన్నిండా పూజాసామాగ్రి ఉంటే హడలిపోకుండా ఉంటారా..? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి బస్‌స్టాండ్ వద్ద ఇదే జరిగింది. ఎవరు తెచ్చి పడేశారో తెలియదు.. 3 రోడ్ల కూడలిలో క్షుద్రపూజలు చేసిన మూటను వదిలివెళ్లారు. దీన్నిండా నిమ్మకాయలు, ఎముకలు, పిండితో చేసిన బొమ్మలు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, కోడిగుడ్లు, కోడి తలలు, గవ్వలు ఇలా చాలానే ఉన్నాయి. ఉదయాన్నే వీటిని చూసిన గ్రామస్థులు హడలిపోయారు. తమకేమైనా అరిష్టం జరుగుతుందేమోనని భయపడ్డారు.
గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో అడపాదడపా క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించినా.. ఇలా పెద్దమొత్తంలో పూజలు చేసిన వస్తువులు నడిరోడ్డుపై పడేయడం స్థానికుల్ని కంగారు పెట్టింది. కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చేతబడి లాంటి మూఢనమ్మకాల్ని కొట్టిపడేసేవాళ్లు మూటను కర్రతో కదిపి ఏముందో చూశారు. మంత్రాలకు చింతకాయలు రాలవని.. ఇలాంటి మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఎంత చెప్పినా ప్రజల్లో మార్పు రావడం లేదు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. ఈ తరహా ఘటనలు ఆగడం లేదు. ఎవరో చెప్పే మాటలు నమ్మి అర్థరాత్రి పూజలు చేస్తే మేలు జరుగుతుందని కొందరు ఇలా చేస్తున్నారు. మంత్రగాళ్లుగా చెలామణీ అయ్యే కొందరు వ్యక్తులు కూడా అమాయకుల బలహీనతల్ని ఆసరాగా చేసుకుని పూజలపేరుతో వారిని బురిడీ కొట్టిస్తున్నారు.
భూపాలపల్లి ప్రధాన రహదారి మోరంచపల్లి బస్‌స్టాప్ వద్ద క్షుద్రపూజల మూట పడేశారన్న విషయం క్షణాల్లోనే చుట్టుపక్కల ఊళ్లకు పాకింది. ఐతే.. ఎవరూ ఇలాంటి వాటిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హేతువాదులు సూచిస్తున్నారు. క్షుద్రపూజలు చేసినట్టుగా పడేసిన వస్తువుల్ని తొక్కినా, చూసినా ఏమీ కాదని.. ఇలాంటి వాటికి భయపడొద్దని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.