కేబినెట్‌లోకి ఆరుగురు.. హరీశ్‌రావుకు ఆర్ధిక శాఖ?.. కేటీఆర్‌కు..

Update: 2019-09-08 00:53 GMT

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. మరికొన్ని గంటల్లోనే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో సాయంత్రం 4గంటలకు నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని కేసీఆర్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందర్‌రాజన్‌కు కేబినెట్‌ ప్రక్షాళనపై సీఎం సమాచారం ఇచ్చారు.

ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో మరో ఆరుగురికి చోటు కల్పించేందుకు అవకాశం ఉండటంతో పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరించేందుకు కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతమున్న మంత్రులను కొనసాగిస్తూనే కొత్తగా ఆరుగురికి చోటు కల్పించడంపై సిఎం కసరత్తు పూర్తి చేశారు. మంత్రి వర్గంలో ఎవరెవరికి చోటు దొరుకుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోపాటు హరీశ్‌రావు (సిద్దిపేట), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), గంగుల కమలాకర్‌ (కరీంనగర్‌), పువ్వాడ అజయ్‌ కుమార్‌ (ఖమ్మం), శాసనమండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్‌‌కు మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో కేటీఆర్‌, హరీశ్‌రావు టీఆర్‌ఎస్‌ తొలి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. సబితా ఇంద్రారెడ్డి ఈ మధ్య టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనమైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో ఒకరు. గంగుల కమలాకర్‌, అజయ్‌ ఎమ్మెల్యేలు కాగా, సత్యవతి ఎమ్మెల్సీ. ఇద్దరు మహిళలను కేబినెట్‌లోకి తీసుకుంటానని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి ఇద్దరికీ అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇవాళ సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యాక రాత్రి 7 గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. 2019-20కి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదనల్ని మంత్రివర్గం ఆమోదించనుంది. కేబినెట్ భేటీకి ముందే నూతన మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు కొందరు మంత్రుల శాఖలను ముఖ్యమంత్రి పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉంది. కేటీఆర్‌కు మరోసారి గతంలో నిర్వహించిన ఐటీ, పరిశ్రమల శాఖ దక్కే అవకాశాలు ఉండగా...హరీశ్‌రావుకు నీటిపారుదల,ఆర్ధిక శాఖల్లో ఏదో ఒకటి ఇస్తారని తెలుస్తోంది.

Full View

Similar News