తెలంగాణ నూతన గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాదాపు 11 వందల మంది అతిథులు హాజరయ్యే ఈ కార్యక్రమం కోసం రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. కాసేపట్లో ఆమె శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాఫ్టర్ లో బేగంపేట వస్తారు. సీఎంతో పాటు మంత్రులు ఆమెకు స్వాగతం పలుకుతారు. అనంతరం తమిళిసై రాజ్ భనవ్ చేరుకున్న తర్వాత సీఎం కేసీఆర్ ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉదయం పదకొండు గంటలకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా నియమితులై ప్రత్యేక గుర్తింపును పొందారు తమిళిసై సౌందరరాజన్. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి గవర్నర్ హోదా వరకు ఎదిగారు ఆమె. 1961 జూన్ 2న కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లో ఆమె జన్మించారు. తల్లి కృష్ణ కుమారి, తండ్రి అనంతన్ . తమిళనాడు కాంగ్రెస్ సీనియర్ నేతగానూ ఎంపీగానూ సేవలందించారు అనంతన్. తమిళిసై మద్రాసు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు చెన్నైలోని రామచంద్ర మెడికల్ కాలేజీలో ఐదేళ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. పలు ఆసుపత్రులకు విజిటింగ్ కన్సల్టెంట్‌గా కూడా ఉండేవారు. తమిళిసై భర్త సౌందరరాజన్ కూడా వైద్యుడే.