పారదర్శకత అంటే ఇదేనా : జనసేనాని

Update: 2019-09-14 03:04 GMT

రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరతతో కార్మికులు అల్లాడుతున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కొరత, ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో సమస్యను తెలుసుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో పర్యటించారు. నవులూరు ఇసుక స్టాక్ పాయింట్ ను పరిశీలించారు. ఈ సందర్భగా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లను కార్మికులు, ప్రజలు కలిసి తమ గోడు చెప్పుకున్నారు.

ఇసుక సరఫరాలో ప్రభుత్వ విధానం ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని పవన్‌ మండిపడ్డారు. 375కి టన్ను ఇసుక వచ్చేస్తుందని చెప్పారని, తీరా స్టాక్ యార్డుకి వచ్చి చూస్తే పరిస్థితి దారుణంగా ఉందన్నారు‌. స్టాక్ యార్డులో టన్నుకి 900 వసూలు చేస్తున్నారని.. ప్రజలపై ఇష్టం వచ్చినట్లుగా భారం మోపుతున్నారని మండిపడ్డారు. ఇసుక కొరత వల్ల ఇప్పటికే భవన నిర్మాణ కార్మికులు పనులు లేక తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారని, నిర్మాణ రంగం మీద ఆధారపడిన వ్యాపారాలు అన్ని తీవ్ర నష్టాల్లో ఉన్నాయని అన్నారు.

ప్రభుత్వం అందరికీ ఇసుక అందుబాటులో ఉంచి తక్కువ ధరకు అందించాల్సిందిపోయి ఇసుక కొరతను సృష్టించి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టడం సరికాదని అన్నారు. ఇసుక మీద స్పష్టమైన పాలసీ తీసుకువచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచాలిగానీ, ఇసుక లేకుండా చేసి ఎక్కువ ధరకు అమ్మడం సరైన విధానం కాదన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ప్రైవేటు వ్యక్తులకి వెళ్లిపోయిందని, టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష సభ్యులు కూడా వాటాలు తీసుకుని ప్రజల్ని దోచుకున్నారన్న విషయం పోరాట యాత్ర సమయంలో తన దృష్టికి వచ్చిందని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం పారదర్శకం అంటోందని, పారదర్శకత అంటే స్టాక్ యార్డుల్లో 375కి బదులు టన్ను ఇసుక 900కి అమ్మడమేనా అని ప్రశ్నించారు.

ఇసుక వ్యవహారం అంతా తప్పుదోవ పట్టించే విధంగా ఉందని, జగన్‌ 100 రోజుల పాలనపై ఇవ్వబోయే నివేదికలో ఇసుక విషయంలో జరుగుతున్న అవకతవకల్ని స్పష్టంగా వివరిస్తామని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ప్రతిపక్షం అంటే పద్దతి పాడులేకుండా ఇష్టం వచ్చినట్టు అధికార పక్షాన్ని తిట్టడం కాకుండా తాము విధానపరంగా జరుగుతున్న లోపాలు, అవకతవకలపై మాత్రమే మాట్లాడతామని జనసేన అధినేత చెప్పారు.

ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానం గురించి క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు నవులూరు వచ్చిన తమ దృష్టికి అనేక ఆసక్తికర విషయాలు తెలిశాయని నాదెండ్ల మనోహర్‌ అన్నారు. గుంటూరు జిల్లాలో మూడు నిల్వ కేంద్రాలు పెట్టారని, ఇక్కడ చూస్తే 10 నుంచి 12 టన్నులు మాత్రమే ఇసుక ఉందన్నారు. ఇంత తక్కువ స్టాక్ పెట్టి ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వైనం ఇక్కడ కనబడుతోందని, పనులు లేక భవన నిర్మాణ కార్మికులు పస్తులు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మొత్తం మీద పవన్ కళ్యాణ్ పర్యటనలో ఇసుక విధానంలో ఉన్న డొల్లతనం, దోపిడీ వెలుగులోకి వచ్చిందని జనసేన శ్రేణులు అంటున్నాయి. దీంతోపాటు జగన్ వంద రోజుల పాలనపై జనసేనాని శనివారం(14/09/2019) స్పందిస్తానని ప్రకటించడంతో ఆసక్తికరంగా మారింది.

Similar News