జగన్ వంద రోజుల పాలనపై పవన్ కల్యాణ్ సంచలన కామెంట్

Update: 2019-09-14 13:52 GMT

ఏపీ సీఎం జగన్‌ 100 రోజుల పాలనపై 9 అంశాలతో 33 పేజీల నివేదికను విడుదల చేశారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందన్నారు. రాష్ట్రంలో ప్రజారోగ్యం పడకేసిందన్న జనసేనాని.. సీజనల్ వ్యాధుల నివారణలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. రివర్స్‌ టెండరింగ్‌ పోలవరానికి శాపంగా మారిందన్నారు. అవినీతి జరిగి ఉంటే విచారణ చేపట్టాలన్న పవన్.. జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని సూటిగా ప్రశ్నించారు.

వ్యాపారవేత్తలను బెదిరిస్తే పెట్టుబడులు వస్తాయా అని ప్రశ్నించారు పవన్ . అమరావతిపై తలో మాట మాట్లాడుతూ సందిగ్ధంలో పడేశారని ఆవేదన వ్యక్తంచేశారు. నవరత్నాలను అమలు చేస్తామంటూ ఎన్నికల్లో తియ్యగా చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక ఎవరి మానాన వారిని వదిలేశారని విమర్శించారు పవన్. గోదావరి, కృష్ణా వరదల సమయంలో.. ప్రజల్ని అప్రమత్తం చేయకుండా.. మంత్రులంతా ప్రతిపక్షనేత ఇంటి చుట్టూ తిరిగారని ఎద్దేవా చేశారు.

Full View

ఇసుక మాఫియా ఆపుతామని ఓట్లు వేయించుకున్న వైసీపీ.. మూడు నెలలైనా కొత్త పాలసీ ప్రకటించలేకపోయిందని పవన్ తప్పుపట్టారు. తన పార్టీ ఆఫీస్ నిర్మాణం సైతం ఆగిందని గుర్తుచేశారాయన. కొత్త విధానంలోనూ పారదర్శకత లేదని స్పష్టంచేశారు. జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై మూడు వారాల్లోనే ప్రజల్లో ఆందోళన వ్యక్తమైందన్నారు పవన్. వైసీపీ పాలన ఇలాగే కొనసాగితే పోరుబాట తప్పదని హెచ్చరించారు. ఇన్నాళ్లలో సర్కారు సాధించింది ఏదైనా ఉందంటే.. అది ప్రజా వేదికను కూల్చడమేనని అన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతుకలను నొక్కడం సరైన పద్ధతి కాదన్నారు పవన్ కల్యాణ్. దీన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పవన్ తెలిపారు. వైసీపీ పాలనలో పారదర్శకత, దార్శనికత లోపించాయని అన్నారు. జగన్‌పైన జరిగిన హత్యాయత్నం కేసు ఏమైందని ప్రశ్నించారు పవన్. సొంత బాబాయ్‌ను దారుణంగా హత్య చేస్తే అప్పుడు సీబీఐ విచారణ అడిగిన జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని నిలదీశారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ ప్రత్యేక హోదా కోసం పోరాడాలని డిమాండ్ చేశారు పవన్.

Also watch:

Full View

Similar News