కొండల మధ్య ఉక్కపోతగా ఉందని లైఫ్‌ జాకెట్లు తీసేశారు.. అంతలోనే..

Update: 2019-09-16 05:12 GMT

కచ్చులూరు బోటు ప్రమాదం డ్రైవర్ల నిర్లక్ష్యమా..? అధికారుల అత్యుత్సాహమా..? ప్రమాదాన్ని ముందుగానే ఊహించలేకపోవడం వల్లే ఇంతటి ఘోర విషాదం జరిగిందా..? లేక ప్రయాణికుల్లో కలిగిన భయం వల్లా..? ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నదేంటి..? ప్రమాదంపై లాంచీ యజమాని చెప్పే మాటల్లో వాస్తవమెంత..? పెను విషాదానికి ప్రకృతి ప్రకోపం కారణమా..? మానవ తప్పిదం వల్లే జరిగిందా..? అసలు నిజానికి ఏం జరిగింది.

మధ్యాహ్నం ఒకటిన్నర సమయం.. వరద గోదావరిపై బోటు వేగంగా వెళ్తోంది.. బోటులోంచి గోదారి అందాలను ఆస్వాదిస్తూ తోటివారితో తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు పర్యాటకులు.. ప్రమాదం జరిగినా బయటపడేందుకు అంతా లైఫ్‌ జాకెట్లు కూడా ధరించారు.. అయితే, రెండు కొండల మధ్య సాగుతున్న ప్రయాణంలో ఉక్కపోతగా ఉందని కొందరు అప్పుడే లైఫ్‌ జాకెట్లు తీసేశారు. అదే సమయంలో భోజనం అనౌన్స్‌మెంట్‌ చేశారు బోటులోని సిబ్బంది. దీంతో పర్యాటకులంతా భోజనం చేసేందుకు సిద్ధమయ్యారు.. ఈ సమయంలోనే ప్రవాహ వేగం ఎక్కువగా అనిపించడంతో డ్రైవర్‌ బోటును మలుపు తిప్పాడు.. అంతా ఒక్కసారిగా బోటుకు ఒకే వైపుకు వచ్చారు. దీంతో బోటు ఒరిగిపోయింది. ప్రమాదాన్ని ముందే ఊహించిన ఐదుగురు సిబ్బంది తప్పించుకుని ఒడ్డుకు చేరుకున్నారు.. లైఫ్‌ జాకెట్లు ఉన్నవారు కూడా తమను తాము రక్షించుకోగలిగారు.. ఆ వెంటనే బోటుతోపాటు లోపలున్న వారంతా మునిగిపోయారు.. ఇదంతా క్షణాల్లో జరిగింది.. స్థానికులు వెంటనే అప్రమత్తమై మరికొందరిని రక్షించగలిగినా, చాలా మంది మృత్యు ఒడిలోకి వెళ్లిపోయారు.

కచ్చులూరు దగ్గర గోదావరి ప్రవాహ వేగం ప్రమాదకరంగా ఉంది.. ఫలితంగా డ్రైవర్లు బోటును అదుపు చేయలేకపోయారు.. అంతేకాదు, ప్రమాదం జరిగిన ప్రాంతంలో పెద్ద సుడిగుండం ఏర్పడింది.. దీని కారణంగానే బోటు అదుపు కాలేదు. ఇది బోటు యజమాని చెబుతున్న మాట.. బోటులో 90 మంది ప్రయాణించవచ్చని చెబుతున్నాడు.. 150 మందికి సరిపడా లైఫ్‌ జాకెట్లు ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

గత కొద్దిరోజులుగా వరద ఉధృతితో గోదావరి నది పోటెత్తుతోంది.. ఇప్పటికీ ఐదు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.. ఇలాంటి సమయంలో నదిలో బోటు ప్రయాణాలు అత్యంత ప్రమాదకరం.. ఇది తెలిసినా, బోటును నదిలోకి ఎలా వెళ్లనిచ్చారనేది అనుమానం కలిగిస్తోంది. ఇక ప్రమాదానికి గురైన రాయల్‌ వశిష్ట బోటుకు పర్యాటక శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేదు.. ఈ విషయాన్ని ఆ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ స్వయంగా చెప్పారు. రాయల్‌ వశిష్ట బోటు ప్రైవేటు వ్యక్తి నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Similar News