జగన్‌ పతివ్రతలా మాట్లాడుతున్నారు : చంద్రబాబు

Update: 2019-09-20 14:23 GMT

ఏపీ సీఎం జగన్‌ ఒక పతివ్రత, నీతిమంతుడిలా మాట్లాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక విధమైన ఉగ్రవాదం సృష్టిస్తూ అన్ని వర్గాలను భయాందోళనకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని దోచుకోవటానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని విమర్శించారు.

అనుకున్న వాళ్లకు ప్రాజెక్టు కట్టబెట్టేందుకు రాష్ట్రాన్ని లూటీ చేస్తారా? , వాటాలు ఇవ్వకపోతే ఎవరినైనా కొట్టేస్తారా?, నవయుగ పరిస్థితి ఏమిటి? బందరు పోర్టు ఎందుకు రద్దు చేశారు? , నిపుణులకంటే జగన్ మేధావా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

ముఖ్యంగా పోలవరం విషయంలో వైసీపీ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రభుత్వ విధ్వంసక చర్యల వల్ల పోలవరం ఆగిపోయిందని ఆరోపించారు. రివర్స్‌ టెండరింగ్‌ అని చెప్పి ఒక వ్యక్తికి రిజర్వ్‌ చేశారని ఆరోపించారు. పోలవరంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల.. ఉభయగోదావరి జిల్లాలు సముద్రంలో కలిసిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. నచ్చిన సంస్థకు పనులు ఇవ్వడం కోసం ప్రాజెక్టు భద్రతను పక్కకు పెడతారా అని ప్రశ్నించారు. పోలవరం ఆపడం దుర్మార్గమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు..

గోదావరిలో బోటు మునిగిపోతే ఇంత వరకూ కనిపెట్టలేని వాళ్లు పోలవరం రీటెండరింగ్ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు పోలవరం ఎత్తు తగ్గిస్తామని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారని.. అయినా ఏపీ పరిస్థితులు ఏం తెలుసునని కేసీఆర్ జోక్యం చేసుకుంటున్నారని చంద్రబాబు నిలదీశారు. ఇప్పుడు తెలంగాణతో మనకు గొడవలు అవసరం లేదని.. పోలవరం పూర్తిచేసుకుని గోదావరి- పెన్నా అనుసంధానిస్తే.. తక్కువ ఖర్చుకే నీళ్లు వస్తాయన్నారు చంద్రబాబు.

Full View

Similar News