మాజీ ఎంపీ శివప్రసాద్.. సినీ, రాజకీయ ప్రస్థానం

Update: 2019-09-21 11:10 GMT

చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత నారమల్లి శివప్రసాద్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. శివప్రసాద్ మూత్ర పిండాల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సుమారు 2 వారాల పాటు చెన్నై ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇటీవలే డిశ్చార్జి అయ్యారు. ఇంతలోనే మరోసారి మూత్ర పిండాల్లో సమస్య తలెత్తడంతో గురువారం మళ్లీ చెన్నై ఆసుపత్రికి తీసుకెళ్లారు . అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన మృతిచెందినట్లు వైద్యులు ప్రటించారు. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు కూడా శివప్రసాద్‌ను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇంతలో ఆయణ మరణవార్త వినాల్సి రావడంపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటన్నారు.

ఓవైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి వచ్చారు శివప్రసాద్ . ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా సేవలందించారు. అనేక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగానూ పనిచేశారు. ఎన్టీఆర్‌ పిలుపుతో టీడీపీలో చేరిన ఆయన 1999-2004 మధ్య సత్యవేడు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1999-2001 మధ్య కాలంలో రాష్ట్ర సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009, 2014లో చిత్తూరు లోక్ సభ స్థానం నుంచి టీడీపీ తరఫున బరిలో దిగి విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసిన శివప్రసాద్, వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమిపాలయ్యారు..అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తిరుపతిలో డాక్టర్‌గా పని చేసిన శివప్రసాద్ నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశారు. ఎన్నో సినిమాల్లో నటించారు. 2006 సంవత్సరంలో విడుదలైన డేంజర్ సినిమాలో విలన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మూవీలో నటనకు నంది అవార్డు కూడా వచ్చింది. ఇంకా అనేక సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించారు శివప్రసాద్. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వివాదం సాగినన్ని రోజులూ రోజుకో వేషంతో అందరినీ ఆకట్టుకున్నారు..

11 జూలై 1951న జన్మించారు నారమల్లి శివప్రసాద్. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పులిత్తివారి పల్లె స్వగ్రామం. తల్లిదండ్రులు నాగయ్య, చెంగమ్మ. 8 మంది సంతానంలో శివప్రసాద్ మూడోవాడు. ఆయనకు ఏడుగురు అక్కచెల్లెళ్లు. ఒకటో తరగతి నుంచి ఐదు వరకు ఐతేపల్లిలో ప్రాథమికవిద్యను అభ్యసించారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చంద్రగిరి బాయ్స్ హైస్కూల్లో చదివారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శివప్రసాద్ క్లాస్‌మేట్. శివప్రసాద్‌ చదువులో ముందుండేవారు. కళల పట్ల మక్కువ చూపేవారు. స్కూళ్లో ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. చంద్రబాబుతోనూ ఒక నాటకం వేయించారు శివప్రసాద్. రక్తకన్నీరు నాటకంలో శివప్రసాద్ ప్రదర్శన ఇంకా కళ్లముందు మెదిలినట్లే ఉందని ఆయన స్నేహితులు ఇప్పటికీ చెబుతారు.. ఆరోజుల్లోనే నాయకత్వల లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు.. జైఆంధ్రా ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా కీ రోల్ పోషించారు.. శివప్రసాద్ మంచి గాయకుడు కూడా. పాఠశాలలో జయంబు నిశ్చయంబురా అనే పాటతో అందరిని అలరించేవారు...తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్యకళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు శివప్రసాద్. పిబ్రవరి26, 1972 లో రాజ్యలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. సాహిత్యము, కళలు, సినిమా నటన వంటి అంశాలపై శివప్రసాద్ కు మక్కవ ఎక్కువ.

శివప్రసాద్ స్వతహాగా రంగస్థల నటుడు. ఎన్నో వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ప్రతినాయకుడిగా పలు చిత్రాల్లో నటించారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. తులసి, దూసుకెళ్తా, ఆటాడిస్తా, మస్కా, కుబేరులు, ఒక్కమగాడు, కితకితలు, డేంజర్, ఖైదీ చిత్రాల్లో ఆయన నటించారు. ప్రేమ తపస్సు, టోపీ రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరొకో చిత్రాలకు శివప్రసాద్ దర్శకత్వం వహించారు.

శివప్రసాద్ కు నటుడిగా, దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరుంది. ప్రముఖ నటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు ఆర్కేరోజాను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది ఆయనే. పలువురు వర్ధమాన నటులను వెండితెరకు పరిచయం చేశారు. హాస్య పాత్రలను పోషించారు. అనేక సినిమాల్లో నటించారు.ఖైదీ లాంటి హిట్‌ సినిమాలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా నటించిన ఈయన 2006 సంవత్సరంలో విడుదలైన డేంజర్ సినిమాలో విలన్‌గా నటించాడు. ఈ సినిమాలో నటనకు ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చి సన్మానించింది. 1991లో విడుదలైన ప్రేమ తపస్సు చిత్రానికి శివప్రసాదే దర్శకుడు. ఇదే ఆయన తొలి చిత్రం. ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్, రోజా మేకప్ లేకుండా నటించారు. పల్లేటి లక్ష్మీ కులశేఖర్ నాటకం ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. లోకం పోకడ తెలియని,కల్లా కపటం లేని అమాయకుని ప్రేమకథ ఇది.

సామాజిక చైతన్య కార్యక్రమాలంటే శివప్రసాద్‌కు ఎంతో ఇష్టం. ఆయన పేరు చెప్పగానే విచిత్ర వేషధారణలు కళ్లముందు మెదలాడుతాయి.రాష్ట్ర విభజన సమయంలో, ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వివిధ వేషాలతో ఆయన నిరసన కార్యక్రమాలు చేపట్టేవారు. శివప్రసాద్ నిరసనలు భిన్నంగా ఉండటంతో అందరి దృష్టి ఆయనపై ఉండేది. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో రోజుకో వేషధారణతో ఆయన నిరసన చేపట్టేవారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం తన వాణిని బలంగా వినిపించేవారు. రాముడు, కృష్ణుడు, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు, హిట్లర్, మాంత్రికుడు, జవహర్ లాల్ నెహ్రూ, స్వామి వివేకానంద ఇలా జాతీయ, అంతర్జాతీయ స్థాయి నాయకులను మొదలుకుని.. గ్రామీణ వేషధారణలతోనూ క్లిష్టమైన సమస్యలను కూడా ఆకట్టుకునేలా చెప్పగలిగారాయన తమ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఇదనిని స్పష్టంగా చెప్పడంతో పాటు... జాతీయ స్థాయిలో అన్ని పార్టీల నాయకులు స్పందించేలా చేయడంలో ఎన్ శివప్రసాద్ దిట్ట.

Full View

Similar News