హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

Update: 2019-09-21 07:57 GMT

ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్‌ నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం హరియాణా, మహారాష్ట్రతో పాటు హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికకు కూడా షెడ్యూల్‌ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 23న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 30వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్‌ 1న పరిశీలిస్తారు. అక్టోబర్‌ 21న ఎన్నిక జరుగుతుంది. 24న ఫలితం వస్తుంది.

హుజూర్‌ నగర్‌ నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గెలిచారు. అనంతరం పార్లమెంట్‌ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక జరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలు ఇప్పటికే ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్‌ తరపున తన సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి పోటీచేస్తారని ఉత్తమ్ ప్రకటించారు. అయితే దీనిపై కాంగ్రెస్‌ పార్టీలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఉత్తమ్‌ ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించారంటూ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో అభ్యర్ధిత్వంపై ఉత్కంఠ నెలకొంది.

టీఆర్ఎస్‌ కూడా హుజూర్‌ నగర్ నియోజకర్గంలో ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే కేటీఆర్‌‌కు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ గెలవని హుజూర్‌ నగర్‌ నియోజకవర్గంలో ఈ సారి ఎలాగైనా గెలిచితీరాలని పట్టుదలగా ఉంది. నియోజకవర్గంలో పార్టీ విజయం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను మోహరిస్తోంది. ఇప్పటికే పార్టీలోకి భారీగా వలసలను ప్రోత్సహిస్తున్నారు. షెడ్యూల్‌ విడుదలకు ముందే పొలిటికల్‌ హీట్‌ రాజేసిన హుజూర్‌ నగర్‌ .. షెడ్యూల్‌ విడుదల కావడంతో మరింత వేడెక్కనుంది.

Also watch :

Full View

Similar News