తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నికకు నగరా మోగడంతో ప్రధాన పార్టీలన్నీ కదన రంగంలోకి దిగాయి. షెడ్యూల్ వచ్చిన వెంటనే అభ్యర్థులను ప్రకటించాయి. నియోజకవర్గంలో అప్పుడే ప్రచారాన్ని పరుగులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అక్టోబర్ 21న హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. సరిగ్గా నెల రోజులు ఉండడంతో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి బరిలోకి దిగుతుండగా... కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి భార్య పద్మావతిరెడ్డి రంగంలోకి దిగారు. అటు బీజేపీ బలమైన అభ్యర్థి కోసం కసరత్తు మొదలు పెట్టింది.
ముఖ్యంగా ఈ బైపోల్ టీఆర్ఎస్‌కు అగ్ని పరీక్షగా మారింది. నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత ఒక్కసారి కూడా గులాబీ జెండా ఎగరలేదు. 2009లో ప్రస్తుత మంత్రి జగదీశ్ రెడ్డి తొలిసారి ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. 2014లో శంకరమ్మ, 2018లో జగదీశ్ రెడ్డి వర్గీయుడు సైదిరెడ్డి పరాజయం పాలయ్యారు. ఈసారి కారు గెలుపు ఈజీనే అంటున్నారు జిల్లా నేతలు. గత ఓటమి కారణాలు విశ్లేషించుకుని.. జాగ్రత్తలు తీసుకుంటామని.. కాంగ్రెస్ నేతలంతా కలిసి వచ్చినా విజయాన్ని ఆపలేరని అంటున్నారు. హస్తంలో అంతర్గత విభేదాలను క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
హుజూర్ నగర్.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సెగ్మెంట్. దీంతో.. కాంగ్రెస్, టీఆర్‌ఎస్.. రెండిటికీ ప్రతిష్టాత్మకంగా మారింది. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు తన సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతిని రంగంలోకి దింపారు ఉత్తమ్. గత ఎన్నికల్లో కోదాడలో స్వల్పతేడాతో ఓడిన పద్మావతిరెడ్డి.. ఈ సారి హుజూర్ నగర్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. హుజూర్ నగర్‌లో పర్యటిస్తున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. ప్రచారంలో మునిగియారు. అధికార పార్టీ ఎన్ని డబ్బులు పంచినా.. హుజూర్ నగర్‌లో కాంగ్రెస్ గెలుపుని ఆపలేరంటున్నారు.
రాష్ట్రంలో పట్టు కోసం తహతహలాడుతున్న బీజేపీ.. అభ్యర్థిని వెతికే పనిలో పడింది. టీడీపీ కూడా బరిలోకి దిగుతుందని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ తమకే మేలు చేస్తాయని అధికార పార్టీ విశ్లేషణ. నల్గొండ ఎంపీ సీటును ఉత్తమ్‌కు కోల్పోయినందుకు, ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన హుజూర్‌నగర్‌ను కైవసం చేసుకుని లెక్క బ్యాలెన్స్ చేయాలని టీఆర్‌ఎస్ తహతహలాడుతోంది. పైగా.. ఉప ఎన్నికను రెఫరెండంగా భావిస్తున్నారు. మండలానికో మంత్రిని పెట్టి స్థానిక లీడర్లను, కేడర్‌ను పరిగెత్తించే పనిలో ఉన్నారు.