తన ప్రాణం కోల్పోయినా.. ప్రయాణికులను రక్షించాడో బస్సు డ్రైవర్. సరిగ్గా తెల్లవారుజామున 5 గంటలకు బస్సు డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. అయితే తాను కుప్పకూలితే బస్సులో ఉన్న ప్రయాణికులందరూ ప్రమాదం భారిన పడతారని అనుకున్నాడు.. చాకచక్యంగా బస్సును పక్కకు ఆపి వారందరి ప్రాణాలు కాపాడి చివరకు అతడు తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన శ్రీకాకుళం జిల్లాలో సోమవారం జరిగింది.
ఖమ్మం నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శ్రీకాకుళం జిల్లా టెక్కలి జాతీయ రహదారి వద్దకు రాగానే డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. దాంతో తీవ్రమైన నొప్పిని భరిస్తూ కూడా బస్సును జాగ్రత్తగా పంట పొలాల్లోకి తీసుకెళ్లాడు డ్రైవర్. ఆ తరువాత కొద్దిసేపటికే మృతిచెందాడు. అయితే బస్సు సడన్ బ్రేకులు వెయ్యడంతో బస్సులోని నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మృతితో ప్రయాణికులు విషాదంలో మునిగిపోయారు.