తూర్పు గోదావరి జిల్లా గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదం.. సమీపాన ఉన్న ఏజన్సీ ప్రాంతాలను వెంటాడుతోంది. ప్రమాదంలో చాలా మంది చనిపోవడంతో గోదావరి నీరు ఆ ప్రాంత వాసుల్ని కలవరపెడుతోంది. ఆ నీటిని తాగితే ఎక్కడ జబ్బునపడతామోనని వాడటం మానేశారు. అంతేకాదు కొందరు గిరిజనులు గోదారమ్మ మైలపడింది.. శుద్ధి చేసేంతవరకు చుక్కనీరు ముట్టకూడదని నిర్ణయించుకున్నారు. కష్టమైనా చలమలు లోనుంచి వచ్చే ఇసుక నీటినే తాగుతున్నారు. వీలైతే అధికారులు తమకు వాటర్ ట్యాంకర్ లు ఏర్పాటు చెయ్యాలని కోరుతున్నారు. మరోవైపు గోదావరి నదిలో ఇంకా బోటు ప్రమాద బాధిత మృతదేహాలు ఉన్నకారణంగా.. వాస్తవానికి పారే నీరు ప్రమాదకరం కాకపోయినప్పటికీ.
ప్రస్తుతానికి ఆ ప్రదేశంలో ఉన్న ఈ నీటిని తాగకపోవడమే మంచిదంటున్నారు. ఇప్పటికే వెలికితీస్తున్న మృతదేహాలును చేపలు కొరికి ఉండటం చేత పాడైపోయాయి. ఎక్కువ సేపు నీటిలో మృతదేహాలు ఉండటం వలన బాడీ కుళ్లిపోయి ఉంటుందని.. తద్వారా నీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉందని కొంతమంది చెబుతున్నారు. అయితే గతంలో గోదావరి నదిలో మరణాలు సంభవించినా నీటిని వాడుకునే స్థానికులు.. తాజా ప్రమాదం తరువాత గోదారమ్మను దూరం పెట్టేశారు. అధికారులు మృతదేహాలను పూర్తిగా బయటకు తీసి నీటిని శుద్ధి చేసేంతవరకు బొట్టుకూడా ముట్టకూడదని నిర్ణయించుకున్నారు.