లీకేజీపై ఉద్యమానికి సిద్ధమైన టీడీపీ.. ఆర్డీఓ కార్యాలయాల..

Update: 2019-09-24 05:39 GMT

గ్రామ సచివాలయ పరీక్ష పత్రాల లీకేజీపై ఉద్యమానికి కార్యాచరణ సిద్ధం చేసింది టీడీపీ. ఉద్యమానికి టీడీపీ తరఫున కమిటీ ఏర్పాటు చేసింది. తొలుత అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది. యూనివర్సిటీలలో రౌండ్ టేబుల్ సమావేశాలు, కలెక్టరేట్‌ల ముట్టడి చేపట్టాలని కార్యాచరణ రెడీ చేశారు. నిరుద్యోగుల తరఫున కూడా జేఏసీ ఏర్పాటు చేసిన బాధిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని టీడీపీ నిర్ణయించింది.

గ్రామ సచివాలయ పరీక్షలో అక్రమాలు జరగలేదంటూ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తల కోసం 18 లక్షల మంది నిరుద్యోగులను ముంచేశామని ఆపార్టీ ఎంపీ చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. పేపర్ లీకైంది.. చర్యలు తీసుకోండి అని లేఖరాస్తే కులాల ప్రస్తావన ఎందుకని ప్రశ్నించారు. నిజంగా సీఎంకు విలువలు, విశ్వసనీయత ఉంటే తప్పులు సరిదిద్దుకోని లీకువీరులపై చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. అంతే కానీ కుల రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతిపాటు చేయవద్దని సూచించారు.

గ్రామ సచివాలయ పరీక్షలో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు వాపోతుంటే.. వారిని నోరెత్తవద్దంటూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. పరీక్షలో జరిగిన అక్రమాలకు సీఎం జగన్‌ నైతిక బాధ్యత వహించాలన్నారు. ఫలితాలను హోల్డ్‌లో పెట్టి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు కళా వెంకట్రావు.

మొత్తానికి ఏపీలో గ్రామ సచివాలయ పరీక్ష ప్రతాల లీజేజీ వ్యవహారం అధికార , విపక్షాల మధ్య రాజకీయ దుమారాన్ని రేపుతోంది. మరోవైపు ఈ పరీక్షలకు తమకు ఎటువంటి సంబంధం లేదని ఏపీపీఎస్సీ చెబుతోంది. తాజాగా టీడీపీ ఉద్యమానికి సిద్ధమవుతూ నిరుద్యోగుల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేస్తోంది.

Similar News