ఏపీలో రివర్స్ టెండరింగ్‌పై రాజకీయ రచ్చ కొనసాగుతోంది.. పోలవరం పనులకు సంబంధించిన మేఘా కంపెనీ టెండర్లు దక్కించుకోగా.. రివర్స్ టెండరింగ్ వల్ల భారీగా ఆదా అయిందని ప్రభుత్వం చెబుతోంది.. అయితే, రివర్స్ టెండరింగ్ ప్రక్రియను టీడీపీ తీవ్రంగా తప్పు పడుతోంది. మేఘా సంస్థతో జగన్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. టెండర్లకు ఇతర కాంట్రాక్టర్లు ముందుకు రాకుండా ప్రభుత్వం బెదిరించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ వల్ల వచ్చిన లాభం కంటే రాష్ట్రంపై పడుతున్న ఆర్ధికభారం కొన్నిరెట్లు ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. జలవిద్యుత్ ప్రాజెక్టు ఆలస్యం వల్ల 6వేల కోట్లకుపైగా అదనపు భారం పడుతుందన్నారు. అటు గోదావరి జలాలను ఏపీలో వెనకబడిన జిల్లాలకు తరలించకుండా తెలంగాణ ప్రయోజనాల కోసం జగన్ ఒప్పందాలు చేసుకోవడం దారుణమన్నారు. ఏపీ ప్రజలకు అన్యాయం చేస్తే ఉరుకునేది లేదన్నారు దేవినేని ఉమ. పోలవరం ఎత్తు తగ్గించే కుట్ర జరుగుతుందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
కాటన్ మహాశయుడు గోదావరి జిల్లాలకు అన్నం పెడితే.. జగన్ మహాశయుడు సున్నం పెడుతున్నాడని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిలిపివేసి.. గోదావరి జిల్లాలకు ముప్పు తెచ్చేలా జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు భద్రతకు భంగం కలిగేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నందున.. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు.