ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులు దోపిడీకి కేరాఫ్‌గా మారాయా? సర్కార్ చెప్తున్నది ఒకటైతే.. దుకాణాల్లో అందుకు భిన్నంగా జరుగుతోంది. మందుబాబులు దోపిడీకి గురవుతున్నారు. బాటిళ్లపై ముద్రించిన MRP ధరలకే మద్యం విక్రయిస్తామని ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటనలు చేస్తున్నా... షాపుల్లో మాత్రం ఎక్స్‌ట్రా ఛార్జ్ చేస్తున్నారు. ప్రతి మద్యం బాటిల్‌పై అదనంగా 20 రూపాయలు వసూలు చేస్తున్నారు.
మద్యపాన నిషేధం తెస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్... ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దుకాణాలు తెరిచారు. అందులోను రేటు పెంచి మద్యం విక్రయిస్తుండడం మందుబాబులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఏపీలోని ప్రభుత్వ వైన్ షాపుల్లో ప్రతి మద్యం బాటిల్‌పై మినిమం 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. సర్కారీ దుకాణాల్లో ఇదేం బాదుడని ట్యాక్స్ పేయర్లు నిలదీస్తున్నారు.
సామాన్యుల బ్రాండ్.. చీప్ లిక్కర్‌పైనా ఎక్స్‌ట్రా బాదుడు ఉండడంతో మందుబాబులు ప్రశ్నిస్తున్నారు. ట్యాక్స్‌పేయర్ల నుంచి ప్రశ్నలు ఊహించని విధంగా విక్రయందార్లు షాక్ తింటున్నారు. కొంటే కొను... లేదంటే లేదంటూ దురుసుగా సమాధానం చెప్తున్నారు. దీంతో.. చేసేది లేక.. 20 రూపాయలు అదనంగా సమర్పించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
మద్యం బాటిల్‌పై 20 రూపాయలు ఎక్కువ వసూలు చేయడాన్ని కొందరు మందుబాబులు జీర్ణించుకోలేకపోతున్నారు. MRPకే అమ్ముతామని ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. తమకు బిల్లు ఇవ్వండని అడుగుతున్నారు. దీంతో.. ప్రభుత్వం నియమించిన సూపర్‌వైజర్లు షాక్ తింటుకున్నారు. బిల్ మెషీన్లు ఇంకా అందలేదని.. వారం రోజుల తర్వాత బిల్లు ఇస్తామంటూ సమాధానం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది.