నవ్యాంధ్రలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కొలువు తీరింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ లాంఛనంగా ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా కరపలో పర్యటించిన జగన్.. గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. కరపలో ఏర్పాటు చేసిన 20 అడుగుల పైలాన్‌ను ఆవిష్కరించారు.
ప్రతీ నాలుగు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం, పట్టణాల్లో వార్డు సచివాలయం ఏర్పాటు చేసి వివిధ శాఖలకు చెందిన 11 మంది ఉద్యోగులను నియమించామని సీఎం జగన్ తెలిపారు. వాలంటీర్లు.. ప్రజలకు, గ్రామ సచివాలయానికి వారధిగా ఉంటూ అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా పథకాలు అందించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రెండు నెలల్లో గ్రామ సచివాలయాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. డిసెంబర్‌లో సేవలు ప్రారంభించి, వచ్చే ఏడాది జనవరి నుంచి పూర్తిస్థాయిలో సేవలు అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. సచివాలయాల రాకతో రాష్ట్రంలో సరికొత్త పాలనను ప్రజలు చూస్తారని సీఎం జగన్ భరోసా ఇచ్చారు.