తిరుపతిలో కోటి రూపాయల విలువ చేసే ఇళ్లు, స్థలంపై వైసీపీ కార్యకర్తల కన్ను పడింది. అధికారం ఉంది కదా అనే ధీమాతో వేరొకరి భూమిని కొట్టేసేందుకు పక్కా ప్లాన్ వేశారు. తమను బెదిరించి స్థలాన్ని, ఇంటిని కబ్జా చేసేందుకు నలుగురు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. తిరుపతి వెస్ట్ జోన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి బాలాజీ కాలనీ సమీపంలోని సర్వే నెంబర్ 955 స్థలంలో ఉన్న 40 అంకణాల స్థలం రాజమ్మపేరు మీద ఉంది. కొన్నేళ్ల క్రితం రాజమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఆస్తి మొత్తం కొడుకు నందకుమార్ అనుభవిస్తున్నాడు. అయితే ఆ ఇంటి పక్కనే నివాసం ఉంటున్న ముగ్గురు వైసీపీ కార్యకర్తలు మోహన్, దినేష్, సాయిల కన్ను పడింది. ఎలాగైనా ఆస్తి దక్కించుకోవాలని ప్రయత్నాలు చేశారు. గతేడాది నుంచి నందకుమార్‌తో గొడవ పడడం మొదలు పెట్టారు. వారి వేధింపుల భరించలేక బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం తమ ఇంటి వెనుక సన్‌సైడ్ నిర్మించుకునేందు ప్రయత్నించారని ఆరోపిస్తున్నాడు బాధితుడు నందకుమార్. అడ్డుకున్న తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
నందకుమార్ కుటుంబం తమపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. తాము ఎక్కడా స్థలాన్ని కానీ, ఇంటిని కానీ ఆక్రమించుకునేందుకు ప్రయత్నించలేదన్నారు. నందకుమార్ తమ స్థలంలో గోడ కట్టేందుకు ప్రయత్నించాడని.. దాన్ని అడ్డుకున్నందుకే తమపై ఆరోపణలు చేస్తున్నాడని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో తిరుపతి వెస్ట్ జోన్ పోలీసులు నలుగురు వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. గొడవపై విచారణ చేపట్టారు.