కంటి వెలుగు ఎవరిది : బీజేపీ ప్రశ్న

Update: 2019-10-11 03:45 GMT

వరల్డ్ సైట్ డే సందర్భంగా గురువారం వైఎస్సార్‌ కంటి వెలుగు పథకానికి అనంతపురంలో శ్రీకారం చుట్టారు సీఎం జగన్. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమైంది. మొత్తం ఆరు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే పాత పథకానికి ముందు..YSR పేరు చేర్చి... మళ్లీ ప్రారంభం చేశారంటూ జగన్ సర్కారును టార్గెట్‌ చేశాయి విపక్షాలు..

2018 ఫిబ్రవరి 1న తెలుగుదేశం హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి ఐ- కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 222 కేంద్రాలలో 67లక్షల మంది లబ్ధి పొందారు. దాదాపు 3 లక్షల మందికి కళ్లజోళ్లు కూడా సరఫరా చేశారు. ఇప్పుడు ఇదే పథకానికి వైఎస్ పేరు తగిలించి.. కొత్త పథకంగా ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం విమర్శిస్తోంది. తమ ప్రభుత్వం.. పేదల కోసం అమలు చేసిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు... కంటి వెలుగుగా ఆర్భాటం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. పక్క రాష్ట్రం మీద ప్రేమతోనే కంటి వెలుగు అని పెట్టి... YSR పేరును తగిలించారని ఎద్దేవా చేశారు..

బీజేపీ వాదన మరోలా ఉంది. కంటి వెలుగు పథకం ఎప్పటి నుంచో అమలులో ఉందంటోంది. దీనికి కేంద్రమే 60 శాతం నిధులిస్తోందన్నది ఆ పార్టీ నేతల వాదన. రాష్ట్రమే ఈ పథకం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ తన తండ్రి పేరు పెట్టారని విమర్శిస్తున్నారు. ఒకవేళ అలా పేరు పెట్టాల్సి ఉంటే మోదీ పేరు ముందుగా పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు బీజేపీ నేతలు..

ఇప్పటికే రైతు భరోసా పథకంపై ఏపీలో పొలిటికల్ హీట్ నడుస్తోంది..మేనిఫెస్టోలో 12, 500 ఇస్తామని ఘనంగా ప్రకటించారు జగన్. కానీ ఆ తర్వాత అందులో కేంద్రం కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇచ్చే 6 వేలు పోగా.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 6,500 మాత్రమే చెల్లిస్తోంది. ఇప్పుడు అగ్రవర్ణాలకు చెందిన కౌలు రైతులకు రైతుభరోసా వర్తించదంటూ కొత్త నిబంధన తెచ్చారు.. ఈ దుమారం చల్లారక ముందే కంటి వెలుగు ఎవరిది అంటూ మరో వివాదం మొదలైంది.

Similar News