తూర్పుగోదావరి జిల్లా తునిలో పత్రికా విలేకరి సత్యనారాయణ హత్యను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. దారుణమైన, క్రూరమైన సంఘటనగా, ఆటవిక చర్యగా జనసేన భావిస్తోందన్నారు. ఇలాంటి ఘటనలతో మనం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నామా అని అనిపించక మానదంటూ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన జర్నలిజాన్ని చంపినట్లుగా ఉందన్నారు. సత్యనారాయణ ఇంటి సమీపంలోనే నడిరోడ్డుపై హత్యకు తెగబడ్డారంటే దీని వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని పవన్ కల్యాణ్ అనుమానం వ్యక్తం చేశారు. గతంలో హత్యాయత్నం జరిగినా పోలీసులు సత్యనారాయణకు రక్షణ కల్పించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం పక్షపాత ధోరణి చూపకుండా దోషులను చట్టం ముందు నిలబెట్టి శిక్షించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
మరోవైపు విలేకరి సత్యనారాయణ హత్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నిందితులను త్వరగా పట్టుకోవాలని డీజీపీని సీఎం జగన్ ఆదేశించారు. ఈ ఘటనపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీతో డీజీపీ సవాంగ్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.