కల్కి భగవాన్‌ను దర్శించుకోవాలంటే అంత ఇవ్వాలా!

Update: 2019-10-22 01:44 GMT

ఇదీ కల్కి భగవాన్ ఆస్తులపై ఐటీ అధికారు లు చేస్తున్న దాడుల తీరు. కల్కి భగవాన్ అక్రమాల పుట్టను బద్దలుకొట్టిన ఐటీశాఖ.. అవినీతి సంపాదన లెక్కలు నిగ్గు తేల్చింది. ఆశ్రమంలో దొరికిన స్వదేశీ, విదేశీ కరెన్సీ కట్టలు చూసి ఐటీ అధికారులే షాక్‌ అయ్యారు. తమిళనాడు, తెలంగాణ, ఏపీలోని సుమారు 40 ప్రాంతాల్లో ఉన్న ఆశ్రమాలు, కార్యాలయాలు, వెల్‌‌నెస్ సెంటర్లు, కల్కి కుమారుడు కృష్ణ నివాసాల్లో సోదాలు చేసిన అధికారులు 44 కోట్ల భారతీయ కరెన్సీతో పాటు 20 కోట్ల విలువైన విదేశీ నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు 90 కేజీల బంగారాన్ని కూడా సీజ్ చేశారు. 4వేల ఎకరాల స్థలాలు గుర్తించారు..

కల్కి భగవాన్‌ అసలు పేరు విజయకుమార్‌నాయుడు. గతంలో ఎల్‌ఐసీలో క్లర్క్‌గా పనిచేశాడు. కొన్నేళ్ల తర్వాత చిత్తూరులో జీవాశ్రమ్‌ పేరుతో రెసిడెన్షియల్‌ స్కూల్‌ ప్రారంభించాడు. ఆ తర్వాత ... విష్ణు భగవానుడి దశావతారాల్లో చివరిదైన కల్కి తానేనని దశాబ్దాలుగా వేలాది మంది భక్తులను నమ్మిస్తూ వస్తున్నాడు విజయ్ కుమార్ నాయుడు. చిత్తూరు జిల్లాలో ఐదు ఎకరాలతో మొదలైన ఆశ్రమం.. ఇప్పుడు వేలాది ఎకరాల్లో సామ్రాజ్యంగా విస్తరించింది. కల్కి భగవాన్‌గా చెప్పుకొని వివిధ చోట్ల ఆశ్రమాలు స్థాపించిన విజయ్ కుమార్‌కు భార్య పద్మావతి, కుమారుడు కృష్ణ, కోడలు ప్రీతి ఉన్నారు..

విజయ్ కుమార్ తనను తాను కల్కి భగవాన్‌గా చెప్పుకుంటే.. భార్య పద్మావతి అమ్మ భగవాన్‌గా ప్రచారం చేసుకున్నారు. ఆశ్రమానికి వచ్చే భక్తుల దగ్గర కల్కి ఆశ్రమ నిర్వాహకులు భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారు. కల్కి భగవాన్‌ను దర్శించుకోవాలంటే 5 వేల నుంచి పాతిక వేల దాకా సమర్పించుకోవాల్సేందే. అక్రమ సొమ్ముతో కల్కీ కుటుంబ సభ్యులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టారని ఐటీ అధికారులు వెల్లడించారు. అమెరికా, చైనా, యూఏఈ, సింగపూర్‌, దుబాయి, ఆఫ్రికా, బ్రిటీష్ వర్జిన్ ఐ‌ల్యాండ్‌తో పాటు పలు దేశాల్లో 100కోట్లకుపైగా పెట్టినట్లు గుర్తించారు. మనీ లాండరింగ్, హవాలా, పన్ను ఎగవేత తదితర అక్రమ మార్గాల్లో ఆస్తులను కూడబెట్టినట్టు తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న కల్కి దంపతుల కోసం ఐటీ అధికారులు గాలిస్తున్నారు..

గతంలో ఆశ్రమానికి వచ్చే విరాళాలు, కొనుగోళ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఐటీ రిటర్న్స్ చూపించేవారు. ప్రభుత్వానికి కూడా సక్రమంగా పన్నులు చెల్లించేవారు. గత మూడేళ్లుగా ట్యాక్సులు సక్రమంగా చెల్లించడం లేదని సమాచారం. ఐటీ రిటర్న్స్ కూడా దాఖలు చేయకపోవడంతో కల్కి ఆశ్రమంపై ఐటీ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. 800 కోట్లకు పైగా అక్రమాస్తులు బయటపడడంతో.. తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

Similar News