తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరులో బోటు ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. గత కొన్ని రోజులుగా చిక్కినట్టే చిక్కి చేజారిపోతున్న బోటును.. ఎట్టకేలకు బయటకు తీసింది ధర్మాడి సత్యం బృందం. పార్టు పార్టులుగా ఊడిపోతున్న బోటును నీటిపైకి తీసుకొచ్చింది.
గత నెల 15 విహారయాత్రకు పర్యాటకులతో వెళ్తున్న వశిష్టబోటు.. కచ్చులూరి దగ్గర గోదావరిలో మునిగిపోయింది. అప్పటి నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతునే ఉన్నాయి. బోటు పూర్తిగా ఇసుకలో కూరుకుపోయి ఉండటంతో బయటకు తీసుకురావడానికి ఇన్ని రోజులు పట్టింది. ధర్మాడి సత్యం బృందానికి తోడు విశాఖ నుంచి డైవర్లు కూడా కలవడంతో ఆపరేషన్ ఎట్టకేలకు సక్సెస్ అయ్యింది.
పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ ఆధ్వర్యంలో బోటును వెలికితీసే ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. బోటును పూర్తిగా వెలికితీసి.. గల్లంతైన వారి ఆచూకీ తెలిసిన తరువాత ఈ ఆపరేషన్ ముగుస్తుంది. ధర్మాడి సత్యం బృందం, విశాఖ నుంచి వచ్చిన ఓం శివశక్తి అండర్ వాటర్ సర్వీసెస్‌కు చెందిన 10 మంది డీప్ వాటర్ మెరైన్ డైవర్లు మట్టి, బురదలో కూరుకుపోయిన బోటును వెలికితీసేందుకు విశ్వ ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి.
వాస్తవానికి సోమవారంతోనే ఆపరేషన్ ముగుస్తుందని అంతా భావించారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో సులభంగానే బోటును బయటకు తీయవచ్చని అనుకున్నారు. విశాఖ నుంచి వచ్చిన డైవర్స్ నది అడుగు భాగంలోకి వెళ్లి.. పడవకు రోప్‌లు బిగించి వచ్చారు. పైకి లాగుతున్న క్రమంలో ఆ బరువును రోప్‌లు తట్టుకోలేకపోయాయి. దీంతో పడవ పైభాగం, డ్రైవర్ కేబిన్‌లోని స్టీరింగ్, గేర్ రాడ్, ఇనుప రెయిలింగ్ బయటకు వచ్చాయి. ఇలా ధ్వంసమైన బోటును మంగళవారం ఎట్టకేలకు బయటకు తీసింది ధర్మాడి సత్యం బృందం.