తెలుగుదేశం పార్టీ నాయకులు బఫూన్లు.. జేసీ దివాకరరెడ్డి రింగ్ మాస్ట్‌ర్ అంటూ సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి రెచ్చిపోయారు. బుక్కరాయసుద్రం మండలం వెంకటాపురం గ్రామంలో టీడీపీ కార్యకర్త కురుబ నాగరాజు ఇంటి నుంచి బయటకు దారి లేకుండా అడ్డంగా బండలు పాతడాన్నిపరిశీలించేందుకు వెళుతోన్న తెలుగుదేశం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి , కేఈ ప్రభాకర్, బీటీ నాయుడు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బండారు శ్రావణి, మాజీ ఎమ్మెల్యే యామిని బాలపై పద్మావతి ఫైర్ అయ్యారు.
కొత్తగా వేసిన రోడ్డు వైసీపీ పార్టీకి చెందిన నారాయణరెడ్డి స్థలంలో ఉందని.. కానుక, ఆ రోడ్డు నారాయణరెడ్డికే చెందుతుందని పద్మావతి తేల్చి చెప్పారు. అవసరమైతే నారాయణ రెడ్డి స్థలాన్ని తాను కొనుగోలు చేసి నాగారాజు కుటుంబ సభ్యులు ఆ రోడ్డు మార్గంలో వెళ్లకుండా అడ్డుకుంటానని హెచ్చరించారు. ఎమ్మెల్యే మాటలతో వెంకటాపురం గ్రామస్థులు ఆవాక్కయ్యారు. ఓ ఎమ్మెల్యేగా ఉండి.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరి మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం చేయకుండా తమ పార్టీ నాయకుడికి సపోర్ట్ చేస్తూ తన ఫ్యాక్షన్ స్వభావాన్ని బయట పెట్టుకున్నారని పద్మావతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.