ఏపీలో కలకలం రేపుతోన్న సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ వ్యవహారం

Update: 2019-11-05 03:51 GMT

ఛీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ వ్యవహారం ఏపీలో కలకలం రేపుతోంది. బాపట్లలో ఉన్న మానవ వనరులశాఖ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేశారు. భూ పరిపాలన శాఖ కమీషనర్ గా వున్న వున్న నీరబ్ కుమార్ ప్రసాద్ కు తాత్కాలిక సిఎస్ గా బాధ్యతలు అప్పగించారు. సిఎం జగన్మోహన్ రెడ్డి ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకుంటారని ఎవ్వరూ ఊహించలేదు. సిఎం జగన్ ఏకంగా ఛీఫ్ సెక్రెటరిపైనే వేటు వేయడం ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

2020 ఏప్రిల్ 30న ఎల్వీ సుబ్రమణ్యం రిటైర్ అవుతారు. అంటే సర్వీసు ఇంకా ఐదు నెలలుంది. ఛీఫ్ సెక్రెటరీగా పదవీవిరమణ చేయాల్సిన అధికారి ఇలా అవమానకర రీతిలో సిఎస్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా వ్యవహరించిన కారణంగా అనీల్ చంద్ర పునేఠాను ఎన్నికల కమిషన్ పదవి నుండి తొలగించింది. సీనియర్ ఐఏఎస్ అయిన ఎల్వీ సుబ్రమణ్యంకు ఏప్రిల్ 5 తాత్కాలిక సిఎస్ గా బాధ్యతలు అప్పగించింది. ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఆయన్ను పూర్తిస్థాయిలో సీఎస్ గా నియమించారు. అయితే గత కొద్దిరోజులుగా సిఎస్ కు సీఎంఓ అధికారుల మధ్య పొసగడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరి.. చివరకు సీఎంఓ తన ఆధిపత్యం నిరూపించుకుంది. సీఎస్ పై బదిలీవేటు పడింది.

ఏపిలో ఛీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం, ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మధ్య గత కొద్ది కాలంగా ఆదిపత్యపు పోరు నడుస్తోంది. పాలనా నిబంధనలు తరచూ ఉల్లంఘిస్తున్నారన్న కారణంతో ప్రవీణ్ ప్రకాశ్ కు ఛీఫ్ సెక్రటరీ ఎల్ వి సుబ్రహ్మణ్యం షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో నిబంధనలకు విరుద్దంగా ఎజెండాను ప్రతిపాదించడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ నోటీసు ఇచ్చారు. అంతేకాదు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సంబంధం లేకుండా ఏ శాఖ అధికారి ఆ శాఖకు చెందిన సబ్జెక్టులపై జీవోలు ఇచ్చుకోవచ్చుననే విధంగా ప్రవీణ్ ప్రకాశ్ గత నెల 25న జీవో ఎంఎస్ నెం.128 ను జారీ చేశారు. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు తక్షణమే అమలు అయ్యే విధంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన ఆ జీవోలో పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు... YSR లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుల జీవో కూడా వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. సీఎం జగన్ కూడా ప్రవీణ్ ప్రకాశ్ ను సమర్దించి.. సీఎస్ ను బదిలీ చేశారు. షోకాజ్ నోటీసు అందుకున్న అధికారే.. సీఎస్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఐఏఎస్ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.

అటు రాజకీయంగానూ ఇది దుమారం రేపుతోంది. అవగాహనా రాహిత్యం... ప్రభుత్వంలో గందరగోళానికి ఇది నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వ్యవస్థలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని.. ఎల్వీని వ్యక్తిగా కాకుండా.. అధికారిగా చూడాలన్నారు చంద్రబాబు. అటు జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలకు ఇది అద్దం పడుతుందని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు. మంచి అధికారిని అవమానకరంగా పంపించడం ప్రభుత్వానికి తగదన్నారు. అటు ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని.. ఇందుకు సిఎస్ బదిలీనే ఉదాహరణ అని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అటు అన్యమతస్తులను తొలగిస్తూ సీఎస్ తీసుకున్న చర్యలే బదిలీ రూపంలో బహుమతి అని మాజీ సిఎస్ IYR కృష్ణారావు విమర్శించారు.

Similar News