తెలంగాణ ఆర్టీసీ ఇక ప్రైవేటు పరం కానుందా..?

Update: 2019-11-06 03:28 GMT

తాజా పరిణామాల నేపథ్యంలో అన్ని వర్గాల్లో ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. దాదాపు 20కిపైగా ప్రధాన డిమాండ్లతో తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు.. ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది. కార్మికులు పట్టువీడటం లేదు.. ప్రభుత్వం మెట్టుదిగడం లేదు. సమస్యపై ఇప్పటికే హైకోర్టు విచారణ జరుపుతోంది.. అటు ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్లు కూడా పూర్తయిపోయాయి. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఆర్టీసీ సమస్యే ప్రధాన ఎజెండాగా ఇప్పటికే మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించిన ప్రభుత్వం.. విలీనం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. అంతేకాదు సమ్మె విరమించకపోతే..

ఆర్టీసీ మనుగడ కూడా కష్టమేనని స్పష్టం చేసింది. విధుల్లో చేరేందుకు కార్మికులకు రెండు గడువులు కూడా ఇచ్చింది. ఇప్పటివరకు ఒకశాతం కన్నా తక్కువమంది కార్మికులే ఉద్యోగాల్లో చేరారు. ఇందులోనూ కొందరు మళ్లీ సమ్మెలోకి వెళ్లిపోయారు. తాజాగా సీఎం కేసీఆర్‌ పెట్టిన డెడ్‌లైన్‌నూ కార్మికులు ఏమాత్రం లెక్కలోకి తీసుకోలేదు.. గడువు లోపల రిపోర్ట్‌ చేసిన కార్మికులు 350 మంది మాత్రమే.. దీంతో ఆర్టీసీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేసిన ఆర్టీసీ జేఏసీ రాజకీయ పార్టీలు, సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంఘాలతో కీలక సమావేశం ఏర్పాటు చేసింది.ప్రభుత్వం విధించిన డెడ్ లైన్లకు భయపడొద్దని నేతలు పిలుపునిచ్చారు. సమ్మె యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్మికులు ధైర్యంగా ఉండాలని.. అంతిమ విజయం కార్మికులదేనని స్పష్టం చేశారు. ఈ నెల 7న హైకోర్టు ఇవ్వబోయే తీర్పు కార్మికులకు అనుకూలంగా ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు..

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి...భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కార్మికుల దీక్షా శిబిరాన్ని పోలీసులు తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది.నిరసనగా ఆర్టీసీ సంఘాలు, రాజకీయ జేఏసీ కొత్తగూడెంలోని అమర వీరుల స్థూపం వద్ద రాస్తారోకో చేపట్టాయి.

వరంగల్‌ నగరంలోని హన్మకొండ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన వంటావార్పు కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నేత నారాయణ పాల్గొన్నారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు..

నిర్మల్ జిల్లా బైంసా డిపో మేనేజర్ జనార్దన్ పై గుర్తు తెలియని దుండగులు దాడిచేశారు. గాయాలపాలైన జనార్దన్ ను ఆసుపత్రికి తరలించారు. డ్యూటీకి వెళుతున్న సమయంలో ఈ అటాక్ జరిగింది. అయితే ఈ ఘటనను ఆర్టీసీ జేఏసీ ఖండించింది. కార్మిక సంఘాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

Similar News