కేబినెట్ మాటంటే మాటే. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక తిరుగుండదు అంటూ ఆర్టీసీ ప్రైవేటీకరణపై తమ వైఖరి కుండబద్ధలు కొట్టారు సీఎం కేసీఆర్. మంగళవారం అర్ధరాత్రిలోగా రిపోర్ట్ చేయకుంటే కార్మికులను విధుల్లోకి తీసుకోబోమని డెడ్ లైన్ తో డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. కానీ, సీఎం హెచ్చరికలకు కార్మికుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. రాష్ట్రంలో 400 మంది వరకు కార్మికులు తిరిగి విధుల్లో చేరారు. దీంతో డెడ్ లైన్ దిక్కరించిన కార్మికులపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి.. సంస్థ భవితవ్యం ఏంటీ అనే అంశాలపై సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్.
దాదాపు తొమ్మిది గంటల సుదీర్ఘంగా జరిగిన ఈ సమీక్షలో హైకోర్టు విచారణ, ఆర్టీసీ ప్రైవేటీకరణపై అధికారులతో చర్చించారు. ఇప్పటికే 5,100 ప్రైవేటు బస్సులకు కేబినెట్ అమోదించటంతో..బస్సుల అద్దెకు తీసుకునేందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించారు. గడువులోగా కార్మికులు విధుల్లో చేరకపోవటంతో కొత్తగా ఎన్ని రూట్లలో ప్రైవేటు బస్సులను అనుమతించవచ్చనే అంశాలపై సీఎం ఆరా తీసినట్లు సమాచారం. సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయనేదానిపైనా ఆయన అడిగి తెలుసుకున్నారు. సమ్మెపై హైకోర్టు విచారణ ఉండటంతో.. న్యాయస్థానంలో వినిపించాల్సిన వాదనలపైనా కేసీఆర్ అధికారులకు కీలక సూచనలు చేశారు..
ప్రభుత్వం పట్టుదలగా పోతుంటే అటు కార్మిక సంఘాలు కూడా వెనక్కి తగ్గేది లేదంటున్నాయి. సమ్మెను మరింత ఉద్ధృతం చేసేలా కార్యచరణ అమలు చేస్తున్నాయి. ఈ నెల 9న మిలియన్ మార్చ్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. డెడ్ లైన్ అంటూ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ కు పాల్పడుతోందన్న ఆర్టీసీ జేఏసీ..కార్మిక సంఘాలను సీఎం చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో కేంద్రం వాటా ఉన్నందున... అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోలేరని.. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు..
సమ్మె ఉద్ధృతం చేయటంలో భాగంగా అన్ని డిపోల ముందు ఆందోళనకు కార్మికులు. ఆందోళనలకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతుందని అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్. సీఎం కేసీఆర్ పట్టింపులకు పోకపోతే సమస్య ఎప్పుడో పరిష్కారం అయ్యేదన్నారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని..త్వరలోనే పార్టీ తరపున కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
ఉద్యోగాలు ఉండవని కేసీఆర్ అల్టీమేటం జారీ చేసినా కేవలం 300 మంది కూడా ఉద్యోగంలో చేరలేదని సెటైర్ వేశారు కోమటరెడ్డి వెంకట్ రెడ్డి. టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని అన్నారు. ముషీరాబాద్ ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనకు వామపక్షాలు మద్దతు తెలిపాయి. ప్రభుత్వ వైఖరికి నిరసన నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నల్లగొండలో ఆర్టీసీ కార్మికులు చెరుకు సుధాకర్ ఆధ్వర్యంలో బస్ డిపో ముట్టడించారు. డిపోలోకి దసుకువచ్చారు. దీంతో పోలీసులు ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. మహబూబాబాద్ లో తెల్లవారుజాము నుంచే బస్ డిపో ముందు బైఠాయించారు. బస్సులను బయటికి రాకుండా అడ్డుకున్నారు.