ప్రయాణికుల అవసరాలను తీర్చలేకపోతున్న ఆర్టీసీ

Update: 2019-11-07 03:52 GMT

ప్రభుత్వం, కార్మిక సంఘాల పంతాలతో ఆర్టీసీ సమ్మె నెల రోజులు దాటింది. తాత్కాలిక సిబ్బందితో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినా అవి ప్రయాణికుల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్ జనాలను దారిదోపిడి చేసేస్తున్నారు. దీంతో సమ్మె క్లైమాక్స్ కోసం 48 వేల కార్మిక కుటుంబాలతో పాటు..ఇటు ప్రజలు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో గురువారం జరగనున్న విచారణపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

ఆర్టీసీ సమ్మెపై విచారణ నేపథ్యంలో...అధికారులు కోర్టులో నిన్న అఫిడవిట్లు సమర్పించారు. ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ అఫిడవిట్లు దాఖలు చేశారు. ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయిలేదని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు నివేదికలో స్పష్టం చేశారు. ఆర్టీసీకి ఉన్న బకాయిలు 3వేల 6కోట్లయితే.. ప్రభుత్వం ఇప్పటికే 3 వేల 903 కోట్లు చెల్లించిందన్నారు. మోటారు వాహనాల పన్ను కింద ఆర్టీసీయే తిరిగి సర్కారుకు 540కోట్లు చెల్లించాలని అఫిడవిట్ లో పేర్కొన్నారు. అటు ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన దానికంటే 867 కోట్లు ఎక్కువే వచ్చాయని ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ తెలిపారు.

జీహెచ్ఎంసీ కూడా తన అఫిడవిట్ లో ఆర్టీసీకి ఇవ్వాల్సింది ఏమి లేదని వివరించింది. 2014-15లో మిగులు బడ్జెట్ సమయంలో ఆర్టీసీకి నిధులు ఇచ్చామని..అయితే..2015-16 నుంచి జీహెచ్ఎంసీ లోటు బడ్జెట్ లో ఉందని అంటున్నారు కమిషనర్ లోకేశ్ కుమార్. ఇక 2018-19 ఏడాదిలో GHMC ఆర్టీసీకి ఎలాంటి బకాయిలేదని వివరించారు. నిధులపై ఆర్టీసీ వినతిని అంగీకరించే ఆర్ధిక స్థితి జీహెచ్ఎంసీకి లేదని అఫిడవిట్ లో స్పష్టం చేశారు.

ప్రభుత్వ అధికారుల వాదన ఇలా ఉంటే కార్మిక సంఘాలు మాత్రం బడ్జెట్ కేటాయింపులకు, నిధుల మంజూరుకు పొంతనే లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తప్పుడు వాదన వినిపిస్తోందని జేఏసీ అంటోంది. సంస్థకు రావాల్సిన బకాయిలకు తోడు..కార్మికులకు అందాల్సిన బకాయిలపై కూడా న్యాయపోరాటం ప్రారంభించారు. CCS త్రిఫ్ట్‌ సొసైటీ డబ్బులు కార్పొరేషన్‌ వెనక్కి ఇచ్చేయాలంటూ కోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. మరోవైపు ఆర్టీసీ ప్రైవేటీకరణను సవాల్‌ చేస్తూ... పీఎల్ విశ్వేశ్వర్‌రావు కోర్టులో పిటిషన్‌ వేశారు.

Similar News