శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.. చెరో రెండున్నరేళ్లు..
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడే దిశగా అడుగులు పడుతున్నాయి. శివసేనతో పొత్తుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగినట్లే కనిపిస్తోంది. బుధవారం సాయంత్రం కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు ఢిల్లీలో ఎన్సీపీ నేత శరద్‌పవార్‌తో సమావేశమయ్యారు. కనీస ఉమ్మడి ప్రణాళిక, మంత్రి పదవుల పంపకం వంటి అంశాలపై దాదాపు నాలుగు గంటలపాటు చర్చించారు. సీఎం పదవిని శివసేన-ఎన్సీపీ చెరో రెండున్నరేండ్లు పంచుకుంటాయని.. కాంగ్రెస్‌కు పూర్తికాలం డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని ఎన్సీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్, ఎన్సీపీ అంగీకరిస్తూనే.. శివసేన హిందుత్వ విధానాన్ని పక్కనబెట్టాలనే షరతు విధించనున్నట్టు తెలుస్తోంది.
ఇక మంత్రి పదవుల్లో శివసేన 16, ఎన్సీపీ 15, కాంగ్రెస్ 12 చొప్పున పంచుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని.. దీనిపై మరో రెండురోజుల్లో స్పష్టత వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్‌రౌత్ తెలిపారు. పొత్తు మూడు పార్టీల మధ్య కాబట్టి చర్చలు సుదీర్ఘంగా సాగుతాయని అన్నారు. బీజేపీకి శివసేన పెట్టిన 50-50 ఫార్ములా కోస్ం.. ప్రస్తుతం ఎన్సీపీ కూడా పట్టుబడుతోంది. దీంతో చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవి పంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తుపై 17 మంది శివసేన ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని వార్తలు రావడం ఆ పార్టీలో ఒక్కసారిగా కలకలం రేపింది. ముఖ్యంగా కాంగ్రెస్-ఎన్సీపీలతో పొత్తు కోసం పాకులాడడంపై ఆ శాస న సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని హోటల్ పాలిటిక్స్ సమయంలో పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రేకు కూడా చెప్పినట్లు ముంబై వర్గాలు చెబుతున్నాయి. అధికారం కోసం హిందూత్వ సిద్ధాంతాన్ని వదిలిపెట్టి, సెక్యులరిజం ముసుగు కప్పుకోవాల్సిన అవసరం ఏముందని ఆ శాసనసభ్యులు గట్టిగా నిలదీసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే శివసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందనే వార్తలు పూర్తి అవాస్తవమని ఆ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. అందరూ పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే మాటకు కట్టుబడి ఉన్నారని చెబుతున్నారు.