ఒక్క క్షణం.. ఏదైనా జరగొచ్చు..

Update: 2019-11-24 04:46 GMT

క్షణం.. ఒక్క క్షణం..

ఏదైనా జరగొచ్చు..

తల రాతలే మారిపోవచ్చు..

నిండు నూరేళ్ల జీవితం ముగియొచ్చు..

రాజకీయం రంగులు మార్చొచ్చు..

నిన్న అనుకున్నది నేడు ఉండదు..

నేడు అనుకున్నది రేపు జరగదు..

ఏదీ ఎవరి చేతుల్లో ఉండదు..

ఇది వేదాంతం కాదు.. అక్షర సత్యం..

అందుకు శనివారం చోటు చేసుకున్న రెండు ఘటనలే సజీవ సాక్ష్యాలు.. ఒకటి హైదరాబాద్‌లో జరిగిన కారు ప్రమాదం.. రెండోంది మహారాష్ట్రలో సీఎంగా ఫడ్నవిస్‌ ప్రమాణ స్వీకారం..

హైదరాబాద్‌లో మిట్ట మధ్యాహ్నం ఎప్పటిమాదిరే ఒక మహిళ బస్‌ కోసం.. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌ కింద ఎదురుచూస్తోంది. ఆ బస్సు వస్తే.. తాను అనుకున్న గమ్యానికి హ్యాపీగా చేరుకునేది.. కుటుంబ సభ్యులతో సాఫీగా.. సాగాల్సిన ఆమె జీవితం అంతా తలకిందులైంది.. ఏం పాపం తెలియని ఆమెను మృత్యువు కాటేసింది. అసలు ఆమెకు ప్రమాదంతో ఎలాంటి సంబంధం లేదు.. కారు రూపంలో వచ్చిన మృత్యువు ఆమె నూరేళ్ల జీవితానికి పుల్‌స్టాప్‌ పెట్టింది..

బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై కారు ఓవర్ స్పీడ్‌తో వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కారు తునా తునకలు కాగా, చెట్టు కూడా విరిగి పడింది. అదుపు తప్పిన కారు మెరుపు వేగంతో కిందున్న కార్లపై పడింది.. దీంతో కిందున్న కార్లన్నీ ధ్వంసం అయ్యాయి. ఆ పక్కనే బస్‌ కోసం ఎదురు చూస్తున్న సత్యవేణి అనే మహిళ మృతి చెందింది. ఆమెకు ఆ క్షణం వరకు తెలియదు తన జీవితం అలా ముగుస్తుందని. ఇలాంటి ఘటనలు గతంలోనూ ఎన్నో జరిగాయి..

ప్రమాదాలు అంటేనే ఇంత.. అంతా క్షణాల్లోనే.. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. కానీ రాజకీయాల్లోనూ క్షణాల్లోనే తలరాత మారిపోయింది. మహారాష్ట్ర సీఎంగా.. ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి అని ఉద్దవ్‌ అనుకుని ఉంటారు.. శుక్రవారం రాత్రే దీనిపై ఒప్పందం కుదిరింది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి.. ఉద్దవ్‌ ను సీఎంగా బలపరిచాయి. గవర్నర్‌ను కలిసి ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే అనుకన్నారు అంతా..

తెల్లారితే మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని.. సీఎంగా ఉద్దవ్‌ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేస్తారంటూ అంతా డిసైడ్‌ అయ్యారు. కాని రాత్రి నిద్రపోయి.. ఉదయం లేచేసరికి పరిస్థితులు మారిపోయాయి.. ఉద్దవ్‌కు సీఎం సీటు పోయింది. కలా.. నిజమా.. అని ఆలోచించే లోపే ఊహించని షాక్‌. ముందు రోజు శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనుకున్న ఎన్సీపీలోని చీలిక వర్గం మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానంటూ ఫడ్నవిస్‌ గవర్నర్‌ను కోరారు.. ఆఘమేఘాలపై రాష్ట్రపతి పాలనను ఎత్తేస్తూ.. ఫడ్నవిస్‌తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్‌. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్‌ ప్రమాణం చేశారు. ఇలా ఒక్క క్షణంలోనే శివసేన.. ఉద్దవ్‌ తలరాత మారిపోయింది. అందుకే ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.

Similar News