టీవీ5 ఆధ్వర్యంలో కర్నాటకలో శివపార్వతుల కల్యాణోత్సవం

Update: 2019-11-24 05:07 GMT

పవిత్ర కార్తీక మాసంలో.. అందునా మాస శివరాత్రి రోజు .. ముల్లోకాలు మురిసే సంబరానికి సర్వం సిద్ధమైది. కర్నాటకలోని దావణగెరెలో కైలాసాన్ని తలపించే కల్యాణ వేదికపై అంగరంగ వైభవంగా శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవం జరగబోతోంది. విశ్వమానవ శ్రేయస్సు కాంక్షిస్తూ టీవీ5 తెలుగు, టీవీ5 కన్నడ, హిందూధర్మం ఛానళ్ళు ఏటా నిర్వహిస్తున్న ఈ కల్యాణోత్సవానికి విశేష సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు, ఆధ్యాత్మిక వేత్తలు కూడా పాలుపంచుకుంటున్నారు. దావణగెరెలో కల్యాణోత్సవం జరుగుతున్న గవర్నమెంట్ హైస్కూల్ వద్ద అతిథులకు, భక్తులకు ఎలాటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచి సాంస్కృతి కార్యక్రమాలతో మొదలై.. రాత్రికి కన్నులపండువగా కల్యాణోత్సవం జరగబోతోంది.

ఆదిదంపతుల కళ్యాణ ఘట్టం. సుమనోహరం. అతిమధురం. ఏటా లక్షలాది మంది భక్తుల జయజయ ధ్వానాల మధ్య శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టే ఈసారీ నిర్వహించబోతోంది టీవీ5 నెట్‌వర్క్. మూడులోకాలనేలే లోకనాధుడు వరుడుగా... జగజ్జనని, లోకబాంధవి పార్వతీదేవి వధువుగా పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఇలాంటి కల్యాణాన్ని ఎక్కడ జరిపించినా, నేరుగా పాల్గొన్నా, చూసినా కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుందని కార్తీక పురాణం చెబుతోంది. కార్తిక మాసంలో శివనామస్మరణ చేసినా, దీపాన్ని వెలిగించినా, దోసెడు గంగాజలంతో అభిషేకించినా విశేష ఫలితం దక్కుతుంది. ఇక.. ఈ పుణ్యకాలంలో గౌరీశంకరుల కల్యాణం చూస్తే అది జన్మజన్మల పుణ్యఫలమే అవుతుంది.

సాయంత్రం మొదలయ్యే కల్యాణఘట్టంలో ప్రతీక్షణం ఎన్నో విశేషాలు ఉండబోతున్నాయి. మాస శివరాత్రి మహా శివుడికి అత్యంత ఇష్టమైన రోజు. ఈ రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామిని పూజిస్తే. మాసమంతా స్వామిని సేవించిన ఫలితం దక్కుతుంది. ప్రదోష వేళలో, అంటే సాయంకాల సమయంలో శివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటాడట.. ఆ తాండవ మూర్తిని దర్శించేందుకు సమస్త దేవతలు అక్కడికి చేరుకుంటారట.. అందుకే సాయంత్రం వేళలో శివపూజ వల్ల మరింత విశేషమైన ఫలితం చేకూరుతుందని చెబుతారు. దావణగెరెలో జరిగే కల్యాణోత్సవం మరోసారి తెలుగు, కన్నడ భక్తులకు నేత్రపర్వంగా సాగనుంది. ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలకు వేదిక కానుంది. సాక్షాత్తు బ్రహ్మ దేవుడే పురోహితుడిగా.. నారాయణుడే కన్యాదాతగా.. పంచ భూతాలు, అష్టదిక్పాలకులు, దేవతలంతా ఆశీర్వచన జల్లులు కురిపిస్తుండగా, పార్వతీదేవిని పరమశివుడు పరిణయమాడే సందర్భం గురించి పురాణాల్లో విని వుంటాం. కానీ, ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం కలిగితే నిజంగా జన్మ ధన్యమైనట్టే. అందుకే ఈ భూకైలాశంలో భక్త కోటికి ఆ దృశ్యాన్ని సాక్షాత్కరింప చేసేందుకు టీవీ5 చేస్తున్న ఈ ప్రయత్నమే శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవం.

Similar News