52 రోజుల సమ్మె ముగించుకుని మంగళవారం విధుల్లో చేరేందుకు డిపోలకు చేరుకున్న కార్మికులను పోలీసులు ఎక్కడిక్కడే అరెస్ట్ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6 డిపోల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. సమ్మె ముగిసింది కాబట్టి విధుల్లో చేరుతున్నామని ఆర్టీసీ కార్మికులు చెబుతుంటే.. లేబర్ కమిషన్ నిర్ణయం వరకు వేచి చూడాలని, విధుల్లో చేరేందుకు వస్తే చర్యలు తప్పవంటున్నారు పోలీసులు.
నిజామాబాద్ జిల్లాలో కూడా కార్మికుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. పలు చోట్ల డిపోల వద్ద అరెస్టులు చేయగా.. మరికొన్ని చోట్ల.. ఇళ్లలోకి వెళ్లి మరీ కార్మికుల్ని అదుపులోకి తీసుకున్నారు. అన్ని బస్ డిపోల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
అటు.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 9 డిపోల పరిధిలో తాత్కాలిక సిబ్బందిని తప్ప ఇతరులు ఎవ్వరినీ అనుమతించడం లేదు. కొన్ని డిపోల వద్ద బారీకేడ్లు సైతం ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. తాత్కాలిక సిబ్బందితో నడిపిస్తున్న బస్సులను అడ్డుకోవచ్చన్న అనుమానంతో.. బందోబస్తు మధ్య వాటిని నడిపిస్తున్నారు. తాము దిగొచ్చి విధుల్లో చేరతామని చెప్పినా.. ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
ఇక.. హైదరాబాద్ హయత్‌నగర్ డిపో వద్ద భారీ బందోబస్తు కొనసాగుతోంది. ఉదయం విధుల్లో చేరేందుకు వచ్చిన కొందరు కార్మికులు.. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో వారిని అరెస్ట్ చేశారు. డిపో సమీపంలోకి ఎవరూ రావడానికి వీల్లేదని.. ఆంక్షలు ఉల్లంఘించి వస్తే అరెస్టులు తప్పవని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీస్ సెక్యూరిటీ మధ్యే తాత్కాలిక డ్రైవర్లు, కండెక్టర్లతో బస్సుల్ని తిప్పుతున్నారు.
ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు నాగర్ కర్నూలు జిల్లాలో తెల్లవారు జామున ర్యాలీగా బయలుదేరిన ఆర్టీసీ కార్మికులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మహిళా ఆర్టీసీ కార్మికులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కార్మికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అటు ఇదే జిల్లాలోని కొల్లాపూర్ ఆర్టీసీ బస్ డిపోల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక్కడ 44 మంది ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
మరోవైపు వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ కు తమను విధుల్లో చేర్చుకోవాలని కార్మికులు వినతి పత్రం ఇవ్వగా.. తమకు పై నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని డిపో మేనేజర్ అన్నారు. దీంతో ఆందోళనకు కార్మికులు దిగారు. వీరిని అరెస్ట్ చేసి పోలీసులు పీఎస్‌కు తరలించారు.